
ఎమ్మెల్సీలుగా ఎన్నికై న మర్రి రాజశేఖర్, ఏసురత్నం, పోతుల సునీత
ఏసురత్నం
పోతుల సునీత
మర్రి రాజశేఖర్
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన ముగ్గురూ విజయకేతనం ఎగురవేశారు.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో సామాజిక న్యాయం పాటించిన సీఎం వైఎస్ జగన్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి అవకాశమివ్వగా, వారిలో ఇద్దరు బీసీ వర్గాలకు చెందినవారే ఉండడం గమనార్హం. వీరిలో మర్రి రాజశేఖర్, ఏసురత్నంలు కొత్తగా పెద్దల సభలో అడుగుపెడుతుండగా, పోతుల సునీత మూడోసారి గెలిచారు. ఈ ముగ్గురూ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా గెలవడం విశేషం.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన ముగ్గురూ గెలిచారు.. ఎమ్మెల్యే కోటాలో మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీతలు గెలుపొందారు. గత నెల 20న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు, పల్నాడు, బాపట్లకు ఒక్కో సీటు కేటాయించారు. ఒక్కొక్కరు 22 ఓట్లతో గెలుపొందారు. మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిస్తే అందులో ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి మాజీ పోలీసు అధికారి, గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పల్నాడు నుంచి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణాజిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్, బాపట్ల నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత గెలుపొందారు.
విధేయతకు పట్టం..
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మర్రి రాజశేఖర్‌కు ఈసారి ఎమ్మెల్సీ పట్టం దక్కింది. న్యాయవాద పట్టా పుచ్చుకున్న ఆయన 2003 వరకు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 1983 సంవత్సరంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తన మేనమామ సోమేపల్లి సాంబయ్య కుమార్తె లలితమ్మను వివాహం చేసుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఓటమి చవిచూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2019 ముందు కాలం వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019కు ముందు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజియనల్ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
మూడోసారి విజయకేతనం..
ప్రస్తుత ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతకు మూడోసారి ఎమ్మెల్సీ పట్టం దక్కింది. బీసీ (పద్మశాలి) సామాజికవర్గానికి చెందిన పోతుల సునీత 2017 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. మొదట 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై న సునీతకు 2021 ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా స్థానం కల్పించారు. మళ్లీ తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు.
పోలీసు నుంచి పెద్దల సభకు..
పోలీసు అధికారిగా పనిచేసిన చంద్రగిరి ఏసురత్నం డీఐజీగా పని చేస్తూ స్వచ్ఛంద విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం ఆయనకు గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా రెండు దఫాలు అవకాశం కల్పించారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన 1982లో ఎస్‌ఐగా కర్నూల్ జిల్లాలో చేరారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ అధికారిగా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఎస్పీగా, అదనపు ఎస్పీ, ఎస్పీగా బాధ్యతలు నిర్వహించి డీఐజీగా స్వచ్ఛంద విరమణ చేశారు. ఈ ముగ్గురూ ఎమ్మెల్సీగా గెలవడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు దక్కిన పదవులు అన్నీ ఎమ్మెల్యే కోటాలోనే...


Comments
Please login to add a commentAdd a comment