
పల్నాడు: పెళ్లయిన దగ్గర్నుంచి మామ లైంగికంగా వేధిస్తున్నాడు. అతనికి ఇద్దరు అత్తలు సహకరిస్తున్నారు. దీనిపై అంధురాలైన ఓ కోడలు భర్తతో కలిసి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేసింది. మామ చేస్తున్న వికృత చేష్టలను చెబుతూ విలపించింది. బాధితురాలి మాటల్లో.. 2013లో పెళ్లయింది. భర్త ప్రైవేటు విద్యుత్ పనులు చేస్తుంటాడు. ఒక బాబు సంతానం. మామకు ఇద్దరు భార్యలు. పెళ్లయిన దగ్గర నుంచి మామ నన్ను వేధించడం మొదలెట్టాడు.
ఇద్దరత్తలతో సంసారం చేస్తూ, నన్నూ సంసారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. లైంగిక సుఖాన్ని ఇవ్వాలని, అదును చూసి బలాత్కారానికి ప్రయత్నిస్తున్నాడు. తన కోరిక తీర్చలేదని నాపై పగ పెంచుకున్నాడు. నాతోపాటు నా భర్తను హింసిస్తున్నాడు. కొడుకు కోసం పెళ్లి చేయలేదని, తన కోసమని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో 2023 జనవరి 3న ఇద్దరి అత్తల సహాయంతో నాపై లైంగిక దాడికి యత్నించి, శరీరమంతా రక్కాడు. దీంతో మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించా. గతంలోనూ నాపై వేరే వారితో దాడి చేయించాడు. ఇవన్నీ కూడా నన్ను లోబర్చుకునేందుకు చేసినవే.
దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినప్పటికీ మామ ప్రవర్తనలో మార్పులేదు. కామవాంఛతో నాపై, నా భర్తపై వేరే వ్యక్తులతో దాడి చేయించాడు. కేసుల్లో రాజీకి రాకపోతే అంతు చూస్తానని ఊళ్లో బహిరంగంగా చెబుతున్నాడు. పలుకుబడి ఉన్న మామ ఏదైనా చేసేందుకు సిద్ధహస్తుడు అని ఆమె వివరించింది. తమ బిడ్డ కోసం జీవిస్తున్నామని, లేనిచో ఈ లోకాన్ని విడిచి వెళ్తామని విలపించింది. ఇప్పటికైనా మామ, ఇద్దరి అత్తలపై బైండోవర్ కేసులు నమోదు చేసి, మామపై రౌడీషీట్ తెరిచి తమకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని అభ్యర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment