పంచాయతీ సెక్రటరీ తీరే వేరు!
సమాచారం ఇవ్వకుండానే విధులకు డుమ్మా
ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా సచివాలయం మార్పు
టీడీపీ నేత చెబితేనే చార్జ్ అప్పగిస్తాడట!
సెలవు కావాలంటే టీడీపీ నేతల చేత ఫోను
ఆయనొక ప్రభుత్వోద్యోగి. విధి నిర్వహ ణలో, అధికారుల ఆదేశాల అమలులో ఒక విధి విధానంతో పని చేయాల్సి ఉంటుంది. కానీ లింగంగుంట్ల కార్యదర్శికి అవేమీ పట్టవు. తనకు తోచింది చేస్తాడు. అదేమంటే పచ్చనేతల గూటికి చేరి అక్కడి నుంచి ‘ఆదేశాలు’ జారీచేయిస్తాడు. ఆయన వ్యవహారశైలి మండల అధికారులకు తలనొప్పిగా మారడంతో చేసేది లేక చివరకు ఉన్నతాధికారులకు విన్నవించారు.
పెదకూరపాడు: మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామ కార్యదర్శి తీరు మండల ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. సక్రమంగా విధులకు, సమావేశాలకు హాజరుకాకుండా తన ఇష్టం వచ్చినట్లు ఆయన వ్యవహార శైలి ఉండటంతో ఎంపీడీవో మల్లేశ్వరి ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. వివరాల్లోకి వెళితే... లింగంగుంట్ల గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ లింగంగుంట్లతో పాటు జలాల్‌పురం, గారపాడు గ్రామాలకు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించే ఆయన ఎన్నికల అనంతరం రూటు మార్చారు. జలాల్‌పురం గ్రామంలోని కొందరు టీడీపీ కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించ వద్దని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాలని మండల స్థాయి అధికారులకు విన్నవించారు. అయితే దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారి అనుమతులు లేకుండా సచివా లయ సిబ్బందిని గ్రామ పంచాయతీకి తీసుకెళ్లి విధులు నిర్వహింప చేయిస్తున్నారు. కార్యదర్శి చేష్టలకు తోటి సిబ్బంది సైతం అవాక్కవుతున్నారు.
టీడీపీ నేత చెబితేనే చార్జ్ అప్పగిస్తా!
గారపాడు గ్రామ రెగ్యులర్ కార్యదర్శి కమల వ్యక్తిగత పనులపై జూలై 26న సెలవు పెట్టారు. దీంతో ఎంపీడీవో తాత్కాలిక కార్యదర్శిగా గారపాడు గ్రామానికి ఫ్రాన్సిస్‌కు అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ కార్యదర్శి కమల తిరిగి ఈ నెల తిరిగి 10వ తేదీన విధు లకు హాజరయ్యారు. ఫ్రాన్సిస్‌ను చార్జ్ అప్పగించమని కమల కోరగా స్థానికంగా ఉన్న టీడీపీ నేత మక్కెన సాగర్ చెబితేనే చార్జ్ అప్పగిస్తానంటూ కమలతో చెప్పడంతో ఆమె ఉన్నతాధికారులు దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్లారు. అయినా ఇప్పటి వరకు కమలకు చార్జ్ అప్పగించలేదు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ిసీనియర్ అసిస్టెంట్‌ను ఫోన్‌లో వివరణ కోరగా ‘ఫోను రికార్డు చేస్తున్నా’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
సెలవు కావాలంటే..
ఫ్రాన్సిస్‌కు సెలవు కావాలంటే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తాలూకా అంటూ వేరొక వ్యక్తి ఎంపీడీవోకు ఫోన్ చేస్తాడు. లేదంటే ఈ నెల 5, 6 ,7 తేదీలో సెలవు మంజూరు చేయా లంటూ ఎంపీడీవోకి వాట్సప్‌లో మెసేజ్ పంపుతారు. ఫ్రాన్సిస్ తీరుపై విసుగుచెందిన ఎంపీడీవో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.
సమావేశాలంటే డోంట్‌కేర్
జనరల్ బాడీ సమావేశమైనా, కార్యదర్శులకు శిక్షణ తరగతులైనా ప్రాన్సిస్ మాత్రం హాజరుకాడు. ఇదేమిటయ్యా... ప్రాన్సిస్ అంటూ తోటి సిబ్బంది చర్చించుకోవడం గమనార్హం.
ఫ్రాన్సిస్‌పై ఆరోపణలు వాస్తవమే
లింగంగుంట్ల కార్యదర్శి ఫ్రాన్సిస్‌పై వస్తున్న ఆరోపణలు వాస్తవమే. సమాచరం లేకుండా విధులకు గైర్హాజరు అవుతున్నారు. జనరల్ బాడీ సమావేశాలు, శిక్షణ తరగతులకు హాజరుకావడం లేదు. ఉన్నతాధికారులు అనుమతి లేకుండా గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించకుండా, పంచాయతీ కార్యాలయానికి సిబ్బందిని తరలించారు. అందుకే చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశాం.
–మల్లేశ్వరి, ఎంపీడీవో, పెదకూరపాడు
Comments
Please login to add a commentAdd a comment