చిచ్చురేపిన ప్రేమ లేఖ | - | Sakshi
Sakshi News home page

చిచ్చురేపిన ప్రేమ లేఖ

Published Wed, Oct 30 2024 2:34 AM | Last Updated on Wed, Oct 30 2024 8:57 AM

-

ఎంఈఓ–1, 2ల మధ్య విభేదాలకు ఆజ్యం   

వర్గపోరుతో రచ్చకెక్కిన విద్యాశాఖ  

గతంలోనూ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు  

కారెంపూడి: ఓ విద్యార్థిని వద్ద లభ్యమైన ప్రేమ లేఖ ఇద్దరు మండల విద్యాశాఖాధికారుల మధ్య చిచ్చురేపింది. దీంతో ఎంఈఓ–1, 2లు ఇద్దరూ రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విద్యాశాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నారు.  స్థానిక కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో ఒక విద్యారి్థని వద్ద ప్రేమ లేఖ దొరకడంతో పాఠశాల ఎస్‌ఓ విద్యార్థిని మందలించారు. బాలిక తరుఫున ఒక పాస్టర్‌ వెళ్లి ఎస్‌ఓతో గొడవ పడ్డారు. దీంతో ఎంఈఓ–2 పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.  

ఈ ఘటన ఎంఈఓ–1కు ఆగ్రహం తెప్పించింది. ‘నేను చేయాల్సిన పని మీరెలా చేస్తారంటూ ఎంఈఓ–2పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు పారేసుకున్నారు. దీనికి ఎంఈఓ–2 తహసీల్దార్‌ చెబితే వెళ్లానని సమాధానమిస్తూ ఎంఈఓ–1 మాటలను కూల్‌గా రికార్డు చేసుకున్నారు. ఆ వాయిస్‌ రికార్డు వెలుగు చూడడంతో ఎంఈఓ–1 మళ్లీ ఆగ్రహించారు. దీనికి కౌంటర్‌గా అన్నట్లు ఎంఈఓ–2 టీచర్లను బెదిరిస్తున్న ఆడియో ఒకటి వెలుగు చూసింది. ఒక స్కూల్లో ముగ్గురు టీచర్లుంటే ఒక టీచర్‌కు మద్దతుగా మిగతా ఇద్దర్ని బెదిరిస్తూ ఎంఈఓ–2 మాట్లాడిన ఫోన్‌ సంభాషణ అది.  ఆ టీచర్‌ ‘‘మీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానంటోందని ఎంఈఓ–2 చెబుతూ భయపెట్టినట్టు ఆడియోలో ఉంది.  

గతంలోనూ విభేదాలే 
ఎంఈఓలిద్దరి మధ్య గతంలోనూ విభేదాలు ఉన్నట్టు సమాచారం. ఒకరిపై ఒకరు అధికారులకు తరచూ ఫిర్యాదులు చేసుకుంటున్నారని తెలుస్తోంది.  వారిద్దరూ విధుల్లో చేరిన దగ్గర నుంచి సఖ్యత లేదని సమాచారం. ఆదర్శంగా ఉంటూ పాఠశాలలను సవ్యంగా నడిపించాల్సిన వారే తగువులాడుకుంటుండడంతో సహజంగానే ఆ దు్రష్పభావం పాఠశాలలపై పడుతోంది. అంతర్లీనంగా ఉపాధ్యాయుల మానసిక స్థెర్యాన్ని దెబ్బతీసేందుకు  ఇలాంటి ఘటనలు తావిస్తున్నాయి.  వాస్తవానికి ఎంఈఓ–1 మండల విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించిన పూర్తి విధులు, బాధ్యతలు నిర్వర్తించాలి. ఎంఈఓ–2 పాఠశాలలను తనిఖీ చేస్తూ అడకమిక్‌ పురోగతికి పాటుపడాలి.  

అందుబాటులో ఉండని ఎంఈఓ–1

కారెంపూడి ఎంఈఓ–1 వెల్దుర్తి, గురజాల, మాచర్ల, దాచేపల్లి మండలాలకూ ఎంఈఓ–1గా ఎఫ్‌ఏసీగా పని చేస్తున్నారు. దీంతో ఆయన అన్నిచోట్లా అందుబాటులో ఉండడం సాధ్యం కాకపోవడంతో ఆయన విధుల్లో ఎంఈఓ–2 వేలు పెడుతున్నారని స్పష్టమవువుతోంది. అత్యవసర సమయాల్లో ఇతర విద్యాశాఖ కార్యక్రమాలలో అందుబాటులో ఉన్న ఎంఈఓ–2నే పాల్గొంటున్నారు.  సమస్య వచ్చినప్పుడు పని ఒత్తిడి వల్ల ఎంఈఓ–1 అందుబాటులో ఉండలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించకపోతే మండలంలో విద్యాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement