మంగళగిరి: ప్రమాదవ శాత్తూ ద్విచక్ర వాహనం చెరువులోకి దూసుకువెళ్లి ఏపీ సచివాలయ పోస్ట్‌మెన్ మృత్యువాత పడిన ఘటన మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో చోటు చేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాత మంగళగిరికి చెందిన జె.కేశవరావు (62) బుధవారం ఉదయం 10 గంటలకు రోజుమాదిరి తన ద్విచక్ర వాహనంపై వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో గల పోస్టాఫీస్ కార్యాలయానికి బయలు దేరాడు. మార్గమధ్యంలోని యర్రబాలెం చెరువు కట్ట వద్దకు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు వెంబడినే ఉన్న చెరువులోకి దూసుకువెళ్లింది.
అయితే ఆ మార్గంలో ప్రయాణించే వారెవరూ ఈ ప్రమాదాన్ని గమనించలేదు. అదే రోజు మధ్యాహ్నం చెరువులో ఓ గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానిక యువకుల చేత బయటకు తీయించారు. ద్విచక్ర వాహనం ఆచూకీ లభించలేదు. అప్పటికే మృతుడు కేశవరావు కడుపు ఉబ్బి ఉండటంతో పాటు మెడలో గుర్తింపు కార్డు వేలాడుతూ కనిపించింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడు కేశవరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి ఓ గంట ముందు నగరంలోని హెడ్ పోస్టుమాస్టర్ నరసింహా రెడ్డిని కలసి తాను ఈ నెల చివరి నాటికి రిటైర్ కాబోతున్నానని, తనకు పోస్టల్‌శాఖ నుంచి రావల్సిన బెనిఫిట్స్‌కు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment