Bapatla: ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్యపోరు | - | Sakshi
Sakshi News home page

Bapatla: ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్యపోరు

Published Wed, Oct 30 2024 2:33 AM | Last Updated on Wed, Oct 30 2024 8:53 AM

-

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్యపోరు  

టీడీపీ అధిష్టానం వద్దకు పంచాయితీ   

ప్రొటోకాల్‌ పాటించడం లేదంటున్న ఎంపీ 

జిల్లా కేంద్రంలో తానే బాస్‌ అంటున్న ఎమ్మెల్యే 

అధికారుల బదిలీలకు పోటాపోటీగా సిఫార్సు లేఖలు 

ఎంపీ లేఖలకు ప్రాధాన్యం ఇవ్వవద్దంటున్న ఎమ్మెల్యే  

మద్యం షాపులు ఏర్పాటులోనూసై అన్న ఇరువర్గాలు  

సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికార తెలుగుదేశం పారీ్టలో ఇంటిపోరు రోడ్డున పడింది. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా పార్టీ రెండు వర్గాలుగా చీలింది.  ఇప్పటికే ఇద్దరు నేతల అనుచరులు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి పంచాయితీ తేల్చాలని ఇన్‌చార్జ్‌ మంత్రి పార్థసారథి, జిల్లా మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌లకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

ఆది నుంచీ విభేదాలు  
ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మల మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నాయి. కృష్ణప్రసాద్‌ను తెలంగాణ బీజేపీ నుంచి దిగుమతి చేసుకుని ఎంపీ అభ్యరి్థగా నిలపడాన్ని జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతోపాటు వేగేశన నరేంద్రవర్మ వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో కృష్ణప్రసాద్, ఆయన కుటంబ సభ్యులతో కలిసి ప్రచారం చేసేందుకూ వర్మ అంగీకరించలేదు. కృష్ణప్రసాద్‌ ఎంపీ అయ్యాక విభేదాలు మరింత పెరిగాయి. కొందరు అధికారుల బదిలీల కోసం ఎంపీ సిఫార్సు లేఖలు ఇవ్వగా ఎంపీలకు అధికారుల బదిలీలతో సంబంధమేమిటని ఎమ్మెల్యే గొడవకు దిగారు. ఎంపీ మాట వినవద్దని జిల్లా స్థాయి అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. జిల్లా అధికారులతో ఎమ్మెల్యే సమావేశమైన ఫొటోలు బయటకు రాగానే ఎంపీ అధికారులతో రివ్యూలు పెట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఇద్దరి పోరుతో జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

రోడ్డెక్కిన రియల్‌ గొడవ 
ఒక సామాజికవర్గం వారిని టార్గెట్‌ చేసే ఎత్తుగడలో భాగంగా బాపట్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో వర్మకు విభేదాలు పొడచూపాయి. అనధికార లేఅవుట్లంటూ పలు వెంచర్లకు ఎమ్మెల్యే నోటీసులు ఇప్పించారు. దీంతో రియల్టర్లు ఎంపీని ఆశ్రయించారు. ఆయన మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో తన నియోజకవర్గంలో పెత్తనమేంటని ఎమ్మెల్యే ఎంపీని 
నిలదీశారు. దీంతో గొడవ రోడ్డెక్కింది.  

మద్యం షాపుల కోసం పోటీపడి..! 
మద్యం షాపుల టెండర్ల వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పోటీ పడి అనుచరులతో టెండర్లు వేయించారు. బాపట్ల కూరగాయల మార్కెట్‌ సెంటర్లో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పోటాపోటీగా పక్కపక్కనే మద్యం షాపులు ఏర్పాటు చేయడం వారి మధ్య విభేదాలను బయట పెట్టింది.  

ఎంపీకి ఆహ్వానం ఉండట్లేదు  
బాపట్ల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే అనుచరులు ఎంపీని ఆహా్వనించడంలేదు. ఒకటి రెండు కార్యక్రమాలకు పిలిచినా ఫ్లెక్సీలలో ఎంపీ ఫొటోలు ప్రొటో కాల్‌కు విరుద్ధగా వేస్తున్నారని ఎంపీ వర్గం మండిపడుతోంది. ఏ చిన్న తప్పు దొరికినా అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకొంటున్నారు.  

ఇసుక అక్రమ రవాణాపై రచ్చ  
ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే వర్గం కీలకంగా ఉంది.  నియోజకవర్గంలో ఒకటిరెండు చోట్ల ఎంపీ వర్గీయులు ఇసుకను తోలుకునే యత్నం చేశారు. ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి ఎంపీ వర్గీయులను కట్టడి చేసినట్లు ప్రచారం ఉంది. బాపట్లలో ఎంపీ కృష్ణప్రసాద్‌ నివాసమున్న ప్రాంతంలో పారిశుద్ధ్య పనులూ చేపట్టవద్దని వర్మ మున్సిపల్‌ అధికారులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.   

టీడీపీ కార్యాలయంలో అధికారులతో ప్రజాదర్బార్‌! 
ఎమ్మెల్యే వర్మ  ఇటీవల టీడీపీ జిల్లా కార్యాలయం వేదికపై అధికారులతో కలిసి ప్రజాదర్బార్‌ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. కొందరు అధికారులు పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించకూడదని చెప్పినా ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదని, అధికారులు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. దీంతో అధికారులు టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ వర్గం అధిష్టానానికి చేరవేసినట్లు తెలుస్తోంది.

బీచ్‌ సందర్శన పన్నుపై వ్యతిరేకత
తాజాగా సూర్యలంక బీచ్‌ సందర్శనకు తలకు రూ.20 పన్ను విధిస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్రవర్మ ప్రకటించడం సంచలనం రేపింది. ఎన్నడూ లేని విధంగా బీచ్‌ సందర్శనకు పన్ను విధించడమేంటని స్వపక్షం నుంచే వ్యతిరేకత వెల్లువెత్తింది. మత్స్యకారులు, ప్రజలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చర్యలతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను పసిగట్టిన ఎంపీ ముఖ్యమంత్రితోపాటు మంత్రి లోకేష్​కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement