సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా బీసీల పార్టీ అని చెప్పుకుంటూ వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న టీడీపీ మరోసారి బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ జనాభా అధికంగా ఉన్న నరసరావుపేటలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అగ్రవర్ణ కులాల వారే ఎంపీలుగా గెలుపొందుతున్నారు. అయితే బీసీలకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పరంపరను మార్చేందుకు ఈ దఫా వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట లోకసభ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌ను పోటీలో నిలిపారు.
ఈ మంచి ఆలోచనను ప్రశంసించిన బీసీ సంఘాలు టీడీపీ సైతం బీసీ అభ్యర్థిని పోటీలో ఉంచాలని కోరాయి. అయితే పెత్తందారుల ప్రతినిధిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు వారి డిమాండ్‌ను పక్కనపెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులును ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. దీనిపై బీసీలు తీవ్రంగా మండిపడుతున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని, ఈ ఎన్నికల్లో ఓటుతో బాబుకు బుద్ధి చెబుతామంటున్నారు.
లావు వ్యతిరేకించినా చదలవాడకే ..
పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నరసరావుపేట అసెంబ్లీ సీటును ఎట్టకేలకు చదలవాడ అరవింద్‌బాబుకు శుక్రవారం టీడీపీ అధిష్టానం కేటాయించింది. ఈ సీటు కోసం పోటీ పడిన కడియాల, నల్లపాటి వర్గాలు ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 30 వేలకుపైగా ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఓడిన వ్యక్తిని మళ్లీ బరిలోకి దింపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేట టికెట్ హామీతోనే టీడీపీలోకి వెళ్తున్నాను అంటూ ప్రచారం చేసుకున్న వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత అట్ల చినవెంకటరెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపారు.
చదలవాడ అరవింద్‌కు టికెట్ ఇవ్వడానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తను పోటీలో ఉంటే సరైన పోటీ ఇవ్వలేమని, ఒకటి రెండు పేర్లు సూచించారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే లావు తీరుకు వ్యతిరేకంగా రెండు రోజుల కిందట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లావు, చదలవాడ వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. పురుగుమందు తాగిన వెంకటరామిరెడ్డిని ఎంపీ లావు కనీసం పరామర్శించలేదని, మా ఓట్లు మీకు అవసరం లేదా అని చదలవాడ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
యాదవ వర్గానికి మొండిచేయి...
నరసరావుపేట అసెంబ్లీ నుంచి యాదవ సామాజిక వర్గ నేతను పోటీలో ఉంచుతామని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ స్థానం నుంచి జంగా కృష్ణమూర్తిని బరిలో దింపాలని లావు శ్రీకృష్ణ ప్రయత్నించారు. మరో ఎన్‌ఆర్‌ఐ నేత పేరును పరిశీలించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్ చేసింది. అయితే శుక్రవారం ప్రకటించిన జాబితాలో యాదవ నేత పేరు లేకపోవడంతో ఆ వర్గం తీవ్ర నిరాశకు లోనైంది. గురజాల, నరసరావుపేటలలో ఏదో ఒక చోట టికెట్ ఇస్తామని ఆశ చూపి చివరకు మొండిచేయి చూపారని, రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment