సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ల రాజకీయ భవిష్యత్తుకు బంధుత్వం అడ్డుగా నిలిస్తోందా..? చంద్రబాబు విభజించు పాలించు రాజకీయాలు తెలిసిన వారు అవుననే అంటున్నారు. ఆర్థికంగా బలమైన నేతలు అందుబాటులోకి వస్తే అప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలనైనా సునాయసంగా అడ్డు తప్పించేయడం చంద్రబాబు నైజం.
అందుకు బాబు ఎంచుకున్న ఎత్తు... కుటుంబానికి ఒకటే సీటు. ఇప్పటికే రాష్ట్రంలో పరిటాల, చింతకాయల, భూమా వంటి కుటుంబాలలో ఒకరికే సీటు ఇస్తానంటూ, నాలుగున్నరేళ్లుగా పార్టీకి పనిచేసిన వారిని పక్కనపెట్టే పనిలో ఉన్నాడు. తాజాగా వియ్యంకులైన జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లకు అదే కారణం చెప్పి శ్రీధర్‌ను సైడ్ చేసే పనిలో బాబు నిమగ్నమయ్యాడు. పెదకూరపాడు అసెంబ్లీ టికెట్ తన వియ్యంకుడైన కొమ్మాలపాటి శ్రీధర్‌కు కేటాయించాలని జిల్లా పార్టీ ఽఅధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చంద్రబాబును ఇటీవల కలిశారట. ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాట మాజీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగేలా చేసిందంట.
వియ్యంకుల్లో ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఇద్దరిలో ఎవరో మీరే తేల్చుకోండని బంతిని వియ్యంకుల కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నాడట. వియ్యంకుడి సీటు కోసం వెళితే తన సీటుకే ఎసురు వచ్చేలా ఉండటంతో ఆంజనేయులు సందిగ్దంలో పడ్డాడట. ఇంతలో చంద్రబాబు కలుగజేసుకొని.. పెదకూరపాడులో ప్రజాబలం అధికంగా ఉన్న నంబూరు శంకర్‌రావును ఎదురించాలంటే ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్ అయితేనే సరిపోతుందన్నట్టు చెప్పకనే చెప్పారట.
రెండుసార్లు ఎమ్మెల్యేను... నాకేందుకు సీటివ్వరు..?
వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు 2009, 2014లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పెదకూరపాడు నుంచి కూడా అదే సమయంలో కొమ్మాలపాటి శ్రీధర్ కూడా రెండుసార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు ఇద్దరు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. 2014లో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వియ్యంకులుగా మారిపోయారు. కొమ్మాలపాటి కొడుకుకు జీవీ ఆంజనేయులు కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. అయితే గత ఎన్నికల తర్వాత కొమ్మాలపాటి ఆర్థికంగా కొంత బలహీనపడ్డాడనే టాక్ టీడీపీలో ఓ వర్గం బలంగా ప్రచారం చేస్తోంది.
దీంతో పెదకూరపాడు నుంచి లోకేష్‌కు సన్నిహితుడు, ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్‌ను ఆ స్థానంలో పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇది గమనించి అధినేత వద్దకు వెళ్లిన జీవీ, కొమ్మాలపాటిలతో చంద్రబాబు మాత్రం ఇద్దరిలో ఒకరికే సీటు ఇస్తా... అదికూడా ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండంటూ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారట. దీంతో వియ్యంకులిద్దరూ ఏం చెయ్యాలో అర్థంకాక ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కొమ్మాలపాటి శ్రీధర్ మాత్రం పార్టీ తరపున మూడు సార్లు పోటీ చేశాను, రెండు సార్లు గెలిచిన వ్యక్తిని నాకు ఎందుకు టికెట్ ఇవ్వరంటూ తన వర్గీయులతో వాపోతున్నాడట. చంద్రబాబు మోసం చేస్తే నా దారి నేను చూసుకుంటా, భాష్యం ప్రవీణ్‌కు సహకరించేది లేదంటూ తేల్చేశాడట.
స్థానికుడికే టికెట్ ఇవ్వాలి...
అధినేత అభిప్రాయం తెలుసుకున్న కొమ్మాలపాటి శ్రీధర్ తన అనుచరులతో బాబుపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్‌లో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం పేరిట తన వర్గీయులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొన్న టీడీపీ నేతలు స్థానికుడు, మూడుసార్లు పోటీ చేసిన శ్రీధర్‌కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు మూటలు చూసి స్థానికేతరుడికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మీటింగ్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడగా వారిని శ్రీధర్ ముఖ్య అనుచరులు వారించినట్టు తెలుస్తోంది. అధికారికంగా భాష్యం ప్రవీణ్‌కు టికెట్ కేటాయించే వరకు సంవయనం పాటించాలని సూచించారట.
Comments
Please login to add a commentAdd a comment