gv Anjaneyulu
-
Vinukonda: రెండుసార్లు ఎమ్మెల్యేను... నాకేందుకు సీటివ్వరు..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ల రాజకీయ భవిష్యత్తుకు బంధుత్వం అడ్డుగా నిలిస్తోందా..? చంద్రబాబు విభజించు పాలించు రాజకీయాలు తెలిసిన వారు అవుననే అంటున్నారు. ఆర్థికంగా బలమైన నేతలు అందుబాటులోకి వస్తే అప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలనైనా సునాయసంగా అడ్డు తప్పించేయడం చంద్రబాబు నైజం. అందుకు బాబు ఎంచుకున్న ఎత్తు... కుటుంబానికి ఒకటే సీటు. ఇప్పటికే రాష్ట్రంలో పరిటాల, చింతకాయల, భూమా వంటి కుటుంబాలలో ఒకరికే సీటు ఇస్తానంటూ, నాలుగున్నరేళ్లుగా పార్టీకి పనిచేసిన వారిని పక్కనపెట్టే పనిలో ఉన్నాడు. తాజాగా వియ్యంకులైన జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌లకు అదే కారణం చెప్పి శ్రీధర్‌ను సైడ్ చేసే పనిలో బాబు నిమగ్నమయ్యాడు. పెదకూరపాడు అసెంబ్లీ టికెట్ తన వియ్యంకుడైన కొమ్మాలపాటి శ్రీధర్‌కు కేటాయించాలని జిల్లా పార్టీ ఽఅధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చంద్రబాబును ఇటీవల కలిశారట. ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాట మాజీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగేలా చేసిందంట. వియ్యంకుల్లో ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఇద్దరిలో ఎవరో మీరే తేల్చుకోండని బంతిని వియ్యంకుల కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నాడట. వియ్యంకుడి సీటు కోసం వెళితే తన సీటుకే ఎసురు వచ్చేలా ఉండటంతో ఆంజనేయులు సందిగ్దంలో పడ్డాడట. ఇంతలో చంద్రబాబు కలుగజేసుకొని.. పెదకూరపాడులో ప్రజాబలం అధికంగా ఉన్న నంబూరు శంకర్రావును ఎదురించాలంటే ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్ అయితేనే సరిపోతుందన్నట్టు చెప్పకనే చెప్పారట. రెండుసార్లు ఎమ్మెల్యేను... నాకేందుకు సీటివ్వరు..? వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు 2009, 2014లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పెదకూరపాడు నుంచి కూడా అదే సమయంలో కొమ్మాలపాటి శ్రీధర్ కూడా రెండుసార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు ఇద్దరు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. 2014లో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వియ్యంకులుగా మారిపోయారు. కొమ్మాలపాటి కొడుకుకు జీవీ ఆంజనేయులు కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. అయితే గత ఎన్నికల తర్వాత కొమ్మాలపాటి ఆర్థికంగా కొంత బలహీనపడ్డాడనే టాక్ టీడీపీలో ఓ వర్గం బలంగా ప్రచారం చేస్తోంది. దీంతో పెదకూరపాడు నుంచి లోకేష్‌కు సన్నిహితుడు, ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్‌ను ఆ స్థానంలో పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. ఇది గమనించి అధినేత వద్దకు వెళ్లిన జీవీ, కొమ్మాలపాటిలతో చంద్రబాబు మాత్రం ఇద్దరిలో ఒకరికే సీటు ఇస్తా... అదికూడా ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండంటూ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారట. దీంతో వియ్యంకులిద్దరూ ఏం చెయ్యాలో అర్థంకాక ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కొమ్మాలపాటి శ్రీధర్ మాత్రం పార్టీ తరపున మూడు సార్లు పోటీ చేశాను, రెండు సార్లు గెలిచిన వ్యక్తిని నాకు ఎందుకు టికెట్ ఇవ్వరంటూ తన వర్గీయులతో వాపోతున్నాడట. చంద్రబాబు మోసం చేస్తే నా దారి నేను చూసుకుంటా, భాష్యం ప్రవీణ్‌కు సహకరించేది లేదంటూ తేల్చేశాడట. స్థానికుడికే టికెట్ ఇవ్వాలి... అధినేత అభిప్రాయం తెలుసుకున్న కొమ్మాలపాటి శ్రీధర్ తన అనుచరులతో బాబుపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం పేరిట తన వర్గీయులతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొన్న టీడీపీ నేతలు స్థానికుడు, మూడుసార్లు పోటీ చేసిన శ్రీధర్‌కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు మూటలు చూసి స్థానికేతరుడికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మీటింగ్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడగా వారిని శ్రీధర్ ముఖ్య అనుచరులు వారించినట్టు తెలుస్తోంది. అధికారికంగా భాష్యం ప్రవీణ్‌కు టికెట్ కేటాయించే వరకు సంవయనం పాటించాలని సూచించారట. -
పైకి మాత్రం నవ్వుల పువ్వులు.. కడపులో కత్తులు పెట్టుకొని మరీ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరింది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితి కొనసాగుతోంది. పైకి మాత్రం అందరూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతూ పలకరించుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి పదవి అప్పగించాక.. పుల్లారావు స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని అధిష్టానం జీవీ ఆంజనేయులకు కట్టబెట్టింది. జీవీ కూడా రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీ వ్యవహరిస్తున్నారు. సొంతింటి నుంచే వెన్నుపోటు ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక లబ్ది చేకూర్చారు. తద్వారా గుంటూరు జిల్లా మీడియాలో ఆయన మనుషులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు చేతిలో ఉన్నందువల్లే పుల్లారావుకు ఎవరిమీద అయినా కోపం ఉంటే పథకం ప్రకారం వారిపై నెగిటివ్ కథనాలు రాయించి డామేజ్ చేస్తుంటారని పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు చెబుతారు. కొన్నాళ్లుగా మాజీ మంత్రి పుల్లారావు, జీవీ ఆంజనేయులుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పుల్లారావు తన పలుకుబడిని ఉపయోగించి జీవీపై మీడియాలో నెగిటివ్ కథనాలు రాయిస్తూ.. వీటిని పార్టీ కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఈ నెగిటివ్ కథనాల వెనుక ఎవరున్నారనేది కొన్నాళ్లపాటు జీవీకి అర్దంకాలేదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని జీవీకి మైండ్ బ్లాకయ్యిందట. తనకు టికెట్ రాకుండా చెయ్యడానికి పుల్లారావు కుట్ర పన్నారని జీవీ ఆంజనేయులు అందరి వద్ద చెప్పుకుంటున్నారట. అప్పటినుంచి పుల్లారావును జీవీ టార్గెట్ చేశారు. చదవండి: (Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు) రాజకీయం కాదు రియల్ బిజినెస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అక్కడే రియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడంలేదు. వీటన్నింటినీ పరిశీలించిన జీవీ.. పుల్లారావు ఎక్కడెక్కడ, ఏం చేస్తున్నాడో వివరిస్తూ పార్టీ నాయకత్వానికి పెద్ద లిస్ట్ పంపించారట. ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండి అడ్డ దిడ్డంగా సంపాదించి కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను గాలికొదిలేశారంటూ ఒక రిపోర్ట్ ను కూడా అధిష్టానానికి పంపారట. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పుల్లారావుకు పొగపెడుతూనే ఉన్నారు. పుల్లారావు కూడా మీడియాను అడ్డం పెట్టుకుని జీవిపై కథనాలు రాయించడం కొనసాగిస్తూనే ఉన్నారట. జీవీ మార్కు రాజకీయం కొంతకాలంగా పుల్లారావు అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నారంటే అందుకు కారణం జీవీ ఆంజనేయులేనని పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పుల్లారావుపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ..ఆయనకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు చిలకలూరిపేటలో పుల్లారావు వ్యతిరేకులందరినీ కలుపుకుని వారితో జట్టుకడుతున్నారట ఆంజనేయులు. ప్రత్తిపాటి కూడా వినుకొండలో జీవీ వ్యతిరేకవర్గాన్ని కూడగట్టి జీవీకి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ పరువును నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. నిన్న కళ్యాణదుర్గం.. నేడు సత్తెనపల్లి వరుసగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ సంస్థాగత కమిటీల విషయంలో తెలుగుదేశం నేతలు ఘర్షణ పడ్డారు. కోడేల శివరాం, వైవీ ఆంజినేయులు వర్గాలు ఒకరిపై ఒకరు గొడవపడ్డారు. కుర్చీలతో కూడా కొట్టుకున్నారు. దీంతో సంస్థాగత నియామకాల సమావేశం రసాభాసగా మారింది. కోడెల శివరాం, జీవి ఆంజినేయుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. దీంతో కమిటీ మీటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజినేయులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. చదవండి: (అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు) -
టీడీపీలో ముసలం.. మాజీ ఎమ్మెల్యేకు సీటు దక్కేనా?
జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే. రెండుసార్లు పచ్చ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగుదేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు. అవినీతి తప్ప నియోజకవర్గంలో అభివృద్ది చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అభివృద్ది నిరోధకుడిగా మారిపోయాడు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయనపై అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఈ ఇన్చార్జ్ మాకొద్దు బాబో.. అంటూ అధినేత వద్ద పచ్చపార్టీ క్యాడర్ గగ్గోలు పెడుతున్నారు. చేసింది శూన్యం.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆంజనేయులు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది చెప్పేందుకేమీ లేదు. సొంతూరుకే రోడ్డు వేయించుకోలేని పరిస్థితి జీవీ ఆంజనేయులుది. వైఎస్సార్ కాంగ్రెస్ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత వినుకొండ పట్టణ వాసులను 70 ఏళ్లుగా పీడిస్తున్న తాగునీటి ఎద్దడిని మూడు నెలల్లో పరిష్కరించారు. వినుకొండకు తాగునీరు అందించే చెరువును టీడీపీ నేత జీవీ అనుచరులు, బంధువులు కబ్జా చేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించింది. చెరువు పునర్జీవనం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువును పరిరక్షించి భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా ఏర్పాటు చేశారు. దీంతో వినుకొండవాసులకు తాగునీటి సమస్య తీరి పోయింది. పట్టణంలోని కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ది చెయ్యడానికి నడుం బిగించారు. దీంతోపాటుగా వినుకొండలో రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్ నిర్మాణాలు మొదలయ్యాయి. ఓర్వలేక కుట్రలు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని జీర్ణించుకోలేని జీవీ ఆంజనేయులు కుట్రలకు తెరతీశారు. కోర్టుకెళ్లడం, స్టేలు తీసుకురావడం వంటి చర్యలతో అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీ నాయకుడు ఇలా చేస్తున్నాడని టీడీపీ కేడర్‌ను ప్రశ్నిస్తే.. తనను ఓడించిన జనంపై కక్ష పెంచుకున్నాడని.. అందుకే ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆదాయానికి అడ్డు పుల్ల వినుకొండ మున్సిపాలిటీకి ఆదాయం పెంచేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా అదే ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే వాటాల దగ్గర తేడా రావడంతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆపించేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతుంటే.. కోర్టుకెళ్ళి అడ్డుకున్నాడు. ఇలా నియోజకవర్గంలో చేయబోతున్న ప్రతి పనినీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అడ్డుకోవడంతో ప్రజలు కూడా ఆయన్ను, పచ్చ పార్టీని చీదరించుకుంటున్నారు. వినుకొండకు విజిటింగ్ ఆఫీసర్ నియోజకవర్గం పార్టీ ఇన్చార్జ్ అయినప్పటికీ జీవీ ఆంజనేయులు వినుకొండలో ఉండడు. అప్పుడప్పుడు విజిటింగ్ ఆఫీసర్లాగా వచ్చి వెళుతుంటాడు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి రోజంతా హడావుడి చేసి మరుసటి రోజు మాయమైపోతాడు. కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. ఆయన ఆఫీసులో కూడా సరైన సమాధానం చెప్పేవారుండరు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆంజనేయులుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు జీవీ ఆంజనేయులు మాకొద్దంటూ అధినేత దగ్గర ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారట. అదేవిధంగా కొందరు సీనియర్ నేతలు సైతం ఈసారి వినుకొండ సీటు ఆంజనేయులుకు ఇస్తే మళ్ళీ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారట. అందుకే ఆంజనేయులుకు ప్రత్యామ్నాయ నేత కోసం టీడీపీ నాయకత్వం వెతుకుతోందని వినుకొండ టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
శావల్యాపురం(వినుకొండ) : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించడంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు సోమవారం మీడియాతో చెప్పారు. మండల కేంద్రం శావల్యాపురంలో టీడీపీ నాయకులు జాతీయ రహదారి మార్గంలో గుంపులుగా ఏర్పడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడమే కాకుండా.. ట్రాఫిక్, ఎన్నికల నిబంధనలు అతిక్రమించినందున మాజీ ఎమ్మెల్యేతో పాటు.. టీడీపీ నేతలు గుంటూరు సాంబశివరావు, గడుపూడి విశ్వనాథం, చెరుకూరి చౌదరి, గోరంట్ల హనుమంతరావు, యరమాసు కోటేశ్వరరావు, పారా చౌదరి, చింతా గంగయ్య, అమృతపూడి కోటయ్య, మాదాల చిరంజీవి, బొల్లా పేరయ్య, దొడ్డా ఏడుకొండలు తదితరులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. 'బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే. టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు. ఏపీకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') కాల్‌మనీ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారు. గతంలో జీవీ ఆంజనేయులు ప్రభుత్వం తయారు చేసే ఫర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కాల్‌మనీ కేసులో డైరెక్ట్‌గా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న. ఇలాంటి నాయకులు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్ పాలన చేస్తున్నారు. సీఎం జగన్ డ్రగ్స్‌ను ఏపీలోకి రానివ్వరు. ఆధారాల్లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు. సత్తెనపల్లిలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు. అయ్యన్న పాత్రుడు చాలా నీచంగా మాట్లాడారు. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని గోపిరెడ్డి మండిపడ్డారు. చదవండి: (రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స) -
రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రాజధాని ఎక్కడ వస్తుంది అనే అంశం గురించి చంద్రబాబు తన టీమ్‌కు ముందుగానే లీకులిచ్చారు. దాంతో రాజధాని ప్రకటించకముందే చంద్రబాబు కోటరీ భారీగా భూములు కొన్నది. సాక్షి టీవీ ఇన్విస్టిగేషన్లో టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగు చూసింది. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షి టీవీ కీలక ఆధారాలు సంపాదించింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కీలక సూత్రధారుగా వ్యవహరించారు. ప్రభుత్వం రాజధాని గురించి ప్రకటించకముందే ఆంజనేయులు, తన కుమార్తె లక్ష్మీ సౌజన్య, తండ్రి సత్యనారాయణ పేరుతో భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బట్టబయలైంది. రాజధాని ప్రాంతంలోని మందడం, కొండమరాజుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, నేలపాడు, వెలగపూడి, వెంకటపాలెం, ఐనవోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఆంజనేయులు భూములు కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 106/1, 106/2 లో అక్టోబర్ 2014లో 2ఎకరాల 22సెంట్ల భూమిని కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో కొన్నట్టు తేలింది. సర్వే నెంబర్ 374/సీ అక్టోబర్ 9, 2014న ఎకరం 79సెంట్లు, సర్వే నెంబర్ 420/1ఏ అక్టోబర్ 9 2014న 96 సెంట్లు, సర్వే నెంబర్ 430/1ఏ సెప్టెంబర్ 23, 2014న 98 సెంట్ల భూమిని తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. (చదవండి: నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు) -
‘సాక్షి’ కథనంపై టీడీపీ శ్రేణుల అక్కసు
వినుకొండటౌన్/శావల్యాపురం(వినుకొండ): గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో సోమవారం ‘దోపిడీ లక్ష్యం.. అవినీతి మార్గం’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. బినామీ పేర్లతో ఎమ్మెల్యే భూఆక్రమణలు, రేషన్ మాఫియా, నీరు–చెట్టు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను ఆ కథనం కళ్లకు కట్టింది. అంతేగాకుండా జన్మభూమికి సేవ పేరుతో కళ్ల జోళ్ల పంపిణీ, కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్టు చేసుకుంటున్న ప్రచారంలోని లోగుట్టును కథనం బట్టబయలు చేసింది. కంచి పీఠాధిపతుల ఆధ్యర్యంలో శంకర్ ఆస్పత్రి నిర్వహిస్తున్న ఆపరేషన్లను తానే సొంత డబ్బుతో చేయిస్తున్నట్టు చెప్పడం అవాస్తవమని పేర్కొంది. ఇవన్నీ బయటపెట్టడాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ శ్రేణులు పత్రిక ప్రతులను, వైఎస్సార్సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. దమ్ముంటే నిజాయితీని నిరూపించుకోండి.. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అవినీతి, అక్రమాలకు నిరసనగా శావల్యాపురంలో జాతీయ రహదారి మార్గంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ‘సాక్షి’ పత్రికను దహనం చేయడంపై వారు మండిపడ్డారు. పత్రికాస్వేచ్ఛను కాలరాయకూడదన్నారు. దమ్ముంటే నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బోడెపూడి శ్రీనివాసరావు, భీమని అంకారావు, పాపసాని సత్యం, పచ్చవ శ్రీనివాసరావు, నర్రా శ్రీహరి, వెంకట్రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే జీవీని నిలదీసిన రైతులు
గుంటూరు, వినుకొండ: సాగు నీరందక పంటలు ఎండిపోతుండటంతో భగ్గుమన్న రైతులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులును ఆదివారం ముట్టడించారు. రాష్ట్రస్థాయి సీఎం కప్ బహుమతుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని తెలుసుకుని ట్రాక్టర్లపై అక్కడికి వెళ్లి నిలదీశారు. మండలంలోని పెదకంచర్ల ప్రాంతంలోని పది గ్రామాల రైతుల పొలాలు నీరు అందక బీడుగా మారుతున్నాయని, మాగాణి భూములు బద్దలుగా పగిలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు సాగర్ జలాలు వచ్చే కాలువ తూమును బొగ్గరం వద్ద అధికారులు మూసివేయటంతో ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. వెంటనే తూముకు వేసిన అడ్డును తొలగించకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. మాచర్ల ప్రాంతంలో సాగర్ కాలువకు గండి పడటంతో నీటి విడుదల ఆపేశారని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే జీవీ సర్దిచెప్పారు. అయినా రైతులు మాత్రం తమ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాల్సిందే అని పట్టుపట్టారు. దీంతో ఆయన ఎన్ఎస్పీ అధికారులకు ఫోన్‌చేసి తూముకు అధికారులు వేసిన అడ్డంకిని తొలగించాలని సూచించారు. దీంతో శాంతించిన రైతులు వెనుదిరిగారు. -
హత్యతో బ్రహ్మనాయుడికి సంబంధం లేదు
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా వెంకటకృష్ణ, గురజాల సోమయ్య, మేడబోయిన మల్లికార్జున్ అనే ముగ్గురు యువకులు వినుకొండ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామంలో వివాదాల కారణంగా కారుతో ఢీకొట్టి ప్రమాదం సృష్టించారని ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడే ముగ్గురి మృతికి కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనిని వైఎస్సార్సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన వినుకొండ సీఐ శ్రీనివాస రావు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బొల్లా బ్రహ్మనాయుడుకి ఈ కేసుతో సంబంధం లేదని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల సోమయ్యకు, ఎనుగంటి రామకోటయ్యకు మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి..పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదంగా సృష్టించాలని నిందితులు భావించారని పేర్కొన్నారు. గతంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, తాజాగా సిమెంటు రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అన్నారు. -
టీడీపీ శవరాజకీయాలపై స్థానికుల ఆగ్రహం
-
నీచ రాజకీయాలు ఎన్నటికీ చేయను
గుంటూరు, వినుకొండ టౌన్: నీచ రాజకీయాలను ఎన్నటికీ చేయనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. వినుకొండ మండలంలోని ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా వెంకటకృష్ణ, గురజాల సోమయ్య, మేడబోయన మల్లిఖార్జున్ ముగ్గురు యువకులు వినుకొండకు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామంలో వివాదాల కారణంగా కారుతో ఢీకొట్టి ప్రమాదం సృష్టించారని ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బొల్లానే ముగ్గురి మృతికి కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన బొల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, కార్యకర్తలను రెచ్చగొడుతూ వారి మధ్య వివాదాలను సృషించి రాజకీయ లబ్ధిపొందాలని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేయడం, ప్రోత్సహించడం తనకు తెలియని విషయాలని చెప్పారు. హత్యలు ఎవరు చేస్తారో? చేయిస్తారో? ప్రజలకు తెలుసన్నారు. గతంలో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయిన జీవీ హత్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముగ్గురిని బలిగొన్నాక కన్వీనర్ సస్పెండా? 2004లో జీవీకి పార్టీ అధిష్టానం అసెంబ్లీకి పోటీ చేసేందుకు సీటు ఎందుకు కేటాయించలేదో? నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని బొల్లా గుర్తుకు చేశారు. 62 ఏళ్లలో వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా నిజాయితీగా చేయడం బ్రహ్మనాయుడుకు మొదటి నుంచి వచ్చిన అలవాటని చెప్పారు. ఎమ్మెల్యే కొత్తపాలెం గ్రామం పార్టీలో వర్గాలను తయారు చేసి వివాదాలకు కారణం కాలేదా అని ప్రశ్నించారు. అందులో భాగంగా టీడీపీ గ్రామ పార్టీ నాయకుడికి వారి పార్టీలో వారికే విభేదాలు వచ్చాయన్నది ఎమ్మెల్యేకు తెలియదా అన్నారు. దీనిని పరిష్కరించకుండా వివాదాన్ని పెంచి పోషిస్తున్నది ఎమ్మెల్యే కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆ వివాదాలను పరిష్కరించుకోవడం కోసం కొందరు మోటారు సైకిల్‌పై, మరికొందరు కారులో వస్తుండగా జరిగిన ఘోరం కాదా ఇది అని నిలదీశారు. ఎమ్మెల్యే పెట్టిన రాజకీయ చిచ్చులో అమాయకంగా ముగ్గురు ముక్కుపచ్చలారని యువకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ సంస్కృతి, రాజకీయాలను ఎన్నటికీ చేయనని బొల్లా చెప్పారు. నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోతున్న ఎమ్మెల్యే ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే జీవీ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ముగ్గురి ప్రాణాలు పోయిన తర్వాత పార్టీ గ్రామ కన్వీనర్‌ను సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. ముందు నుంచి వారి మధ్య వస్తున్న వివాదాలను పరిష్కరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ జీ వీ ఆంజనేయులు
-
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ జీ వీ ఆంజనేయులు
-
బీజేపీ ఓటమి; టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ దెబ్బ బీజేపీకి యూపీలో తగిలిందని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. తెలుగువాళ్ల ఓట్ల ప్రభావం వల్లే ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కర్ణాటకలోనూ తెలుగువారు ఉన్నారని, బీజేపీ నాయకులు జాగ్రత్త పడాలన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో బీజేపీకి ఇప్పటికైనా అర్థమైవుండాలన్నారు. గోరఖ్‌పూర్‌లో తెలుగువాళ్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉపఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లే యూపీ, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసిందని తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాల్లోనే బీజేపీ ఓటమి చవిచూసిందంటే బీజేపీ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలని సూచించారు. -
ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కొరిటెపాడు(గుంటూరు): ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరికంలో ఉన్న ముస్లింలను పైకి తీసుకురావాల్సిన బాధ్యత మైనారిటీ సెల్‌పై ఉందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ మాట్లాడుతూ జిల్లాలో ముస్లింలకు పదవులు కట్టిబెట్టింది టీడీపీనేనన్నారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి ఎమ్మె ల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి,డొక్కా మాణిక్యవరప్రసాదులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గంతో జీవీ ఆంజనేయులు ప్రమాణం చేయించారు. మైనారీటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అమీర్ ఆలీ, పార్టీ నాయకులు మద్దాళి గిరిధర్, గంజి చిరంజీవి, మన్నవ సుబ్బారావు, ఎండీ హిదాయత్లు పాల్గొన్నారు. -
బాబు నమ్మకాన్ని వమ్ము చేయరు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కొరిటెపాడు (గుంటూరు) : ప్రజలు చంద్రబాబుపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే సగానికిపైగా అమలు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసమే ఉచితంగా ఇసుక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి సహకరించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా రాజధానిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎస్ఎం జియావుద్దీన్, దాసరి రాజామాస్టారు, శనక్కాయల అరుణ, మన్నవ సుబ్బారావు, ఇక్కుర్తి సాంబశివరావు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.