(ఫైల్‌ఫోటో)
జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే. రెండుసార్లు పచ్చ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగుదేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు. అవినీతి తప్ప నియోజకవర్గంలో అభివృద్ది చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అభివృద్ది నిరోధకుడిగా మారిపోయాడు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయనపై అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఈ ఇన్‌చార్జ్ మాకొద్దు బాబో.. అంటూ అధినేత వద్ద పచ్చపార్టీ క్యాడర్ గగ్గోలు పెడుతున్నారు.
చేసింది శూన్యం..
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆంజనేయులు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది చెప్పేందుకేమీ లేదు. సొంతూరుకే రోడ్డు వేయించుకోలేని పరిస్థితి జీవీ ఆంజనేయులుది. వైఎస్సార్ కాంగ్రెస్ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత వినుకొండ పట్టణ వాసులను 70 ఏళ్లుగా పీడిస్తున్న తాగునీటి ఎద్దడిని మూడు నెలల్లో పరిష్కరించారు. వినుకొండకు తాగునీరు అందించే చెరువును టీడీపీ నేత జీవీ అనుచరులు, బంధువులు కబ్జా చేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించింది.
చెరువు పునర్జీవనం
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువును పరిరక్షించి భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా ఏర్పాటు చేశారు. దీంతో వినుకొండవాసులకు తాగునీటి సమస్య తీరి పోయింది. పట్టణంలోని కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ది చెయ్యడానికి నడుం బిగించారు. దీంతోపాటుగా వినుకొండలో రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్ నిర్మాణాలు మొదలయ్యాయి.
ఓర్వలేక కుట్రలు
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని జీర్ణించుకోలేని జీవీ ఆంజనేయులు కుట్రలకు తెరతీశారు. కోర్టుకెళ్లడం, స్టేలు తీసుకురావడం వంటి చర్యలతో అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీ నాయకుడు ఇలా చేస్తున్నాడని టీడీపీ కేడర్‌ను ప్రశ్నిస్తే.. తనను ఓడించిన జనంపై కక్ష పెంచుకున్నాడని.. అందుకే ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఆదాయానికి అడ్డు పుల్ల
వినుకొండ మున్సిపాలిటీకి ఆదాయం పెంచేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా అదే ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే వాటాల దగ్గర తేడా రావడంతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆపించేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతుంటే.. కోర్టుకెళ్ళి అడ్డుకున్నాడు. ఇలా నియోజకవర్గంలో చేయబోతున్న ప్రతి పనినీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అడ్డుకోవడంతో ప్రజలు కూడా ఆయన్ను, పచ్చ పార్టీని చీదరించుకుంటున్నారు.
వినుకొండకు విజిటింగ్ ఆఫీసర్
నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్ అయినప్పటికీ జీవీ ఆంజనేయులు వినుకొండలో ఉండడు. అప్పుడప్పుడు విజిటింగ్ ఆఫీసర్‌లాగా వచ్చి వెళుతుంటాడు. తనకు అనుకూలంగా ఉన్న మీడియాను పిలిచి రోజంతా హడావుడి చేసి మరుసటి రోజు మాయమైపోతాడు. కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. ఆయన ఆఫీసులో కూడా సరైన సమాధానం చెప్పేవారుండరు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆంజనేయులుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది.
ఇప్పటికే కొందరు నేతలు జీవీ ఆంజనేయులు మాకొద్దంటూ అధినేత దగ్గర ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారట. అదేవిధంగా కొందరు సీనియర్ నేతలు సైతం ఈసారి వినుకొండ సీటు ఆంజనేయులుకు ఇస్తే మళ్ళీ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారట. అందుకే ఆంజనేయులుకు ప్రత్యామ్నాయ నేత కోసం టీడీపీ నాయకత్వం వెతుకుతోందని వినుకొండ టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment