గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి.. ముగ్గురు యువకులు మృతి | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి.. ముగ్గురు యువకులు మృతి

Published Wed, Sep 27 2023 2:06 AM | Last Updated on Wed, Sep 27 2023 12:15 PM

చెరువు వద్ద గాలింపు చర్యలను పరిశీలిస్తున్న కుటుంబ సభ్యులు, స్థానికులు  - Sakshi

చెరువు వద్ద గాలింపు చర్యలను పరిశీలిస్తున్న కుటుంబ సభ్యులు, స్థానికులు

పల్నాడు: వినాయకుని విగ్రహం నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు మృత్యువాత పడిన ఘటన గణపవరం గ్రామంలో సోమవారం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం వలస వచ్చి కూలిపని చేసుకుని జీవిస్తున్న మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరంలోని ఓ స్పిన్నింగ్‌ మిల్లులో బేల్‌దారీ కార్మికుడిగా మహారాష్ట్రకు చెందిన ముఖేష్‌మోతిరామ్‌ ఖోటే (39) పనిచేస్తుంటాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన భాగ్యం ప్రవీణ్‌ (18), శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం బొమ్మిడివానిపేటకు చెందిన కోన వసంతకుమార్‌ (18) తల్లిదండ్రులు కంపెనీ క్వార్టర్లలో నివాసం ఉంటూ అక్కడే కూలీలుగా పనిచేస్తుంటారు. ప్రవీణ్‌, వసంత్‌కుమార్‌ ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు.

వినాయక చవితి సందర్భంగా ముఖేష్‌ ఇంట్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సోమవారం ముఖేష్‌, ప్రవీణ్‌, వసంత్‌ వేలూరు రోడ్డులోని ప్రభువు చెరువుకు సాయంత్రం 6 గంటలకు వెళ్ళారు. 9 గంటలైనా ముగ్గురూ తిరిగి రాకపోయేసరికి ప్రవీణ్‌, వసంత్‌ తల్లిదండ్రులు ఆందోళనకు గురై చెరువు వద్దకు వెళ్ళారు. అక్కడ వారి చెప్పులు, బైక్‌, సైకిల్‌, సెల్‌ఫోన్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించగా రాత్రి 11 గంటల సమయంలో భాగ్యం ప్రవీణ్‌ మృతదేహం లభించింది.

అర్ధరాత్రి ఒంటి గంట వరకూ వెతికినా మిగిలిన వారి జాడ కానరాక పోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఉదయాన్నే మళ్లీ గాలింపు చేపట్టగా ముఖేష్‌ మోతిరామ్‌ఖోటే మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోన వసంతకుమార్‌ మృతదేహం లభ్యమైంది. ముగ్గురి మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రూరల్‌ ఎస్సై రాజేష్‌ కేసు నమోదు చేశారు.

అడుగు విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళి..
వినాయక చవితి సందర్భంగా ముఖేష్‌ నివాసంలో అడుగు ఎత్తు గల వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి సోమవారం వరకూ పూజలు జరిపారు. మహారాష్ట్రలో నివాసం ఉండే తల్లి మృతి చెందిందని కబురు రావటంతో పూజలు నిలిపివేసి వినాయకుని నిమజ్జనం చేసేందుకు క్వార్టర్లలో ఉండే ప్రవీణ్‌, వసంత్‌ సహాయం కోరాడు ముఖేష్‌. తాను సైకిల్‌పై, ప్రవీణ్‌, వసంతకుమార్‌ ఇద్దరూ బైక్‌పై విగ్రహాన్ని తీసుకుని చెరువు వద్దకు వెళ్ళారు. ముగ్గురూ ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ చెరువు వద్దకు వెళ్లి అందులో మునిగినట్టు గుర్తించారు.

అనాథలుగా ముగ్గురు చిన్నారులు
ముఖేష్‌మోతిరామ్‌ఖోటే ముగ్గురు పిల్లలతో ఏడాది క్రితం గణపవరం వచ్చి స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తూ క్వార్టర్లలో ముగ్గరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం వదిలి వెళ్లిపోయింది. ఇద్దరు చిన్నారులు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మూడో చిన్నారి రెండేళ్ల పాప కావటంతో ముఖేష్‌ అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. తండ్రి మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు.

ఐటీఐ పాసై ఉద్యోగ వేటలో ఉండగా..
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం దమ్మిడివానిపేట గ్రామానికి చెందిన కోన రామారావు పదేళ్లుగా స్థానిక కంపెనీ క్వార్టర్లలో ఉంటూ పనులకు కావలసిన కూలీలను సరఫరా చేసే మేసీ్త్రగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు వసంత్‌కుమార్‌ చిలకలూరిపేటలోని ఏఎంజీలో ఐటీఐ ఎలక్ట్రికల్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాడు. అతను ఇప్పుడు మరణించడంతో రామారావుతోపాటు ఆయన భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.

సాయంగా వెళ్లి..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన భాగ్యం పుల్లయ్య, విజయమ్మ దంపతులు నాలుగేళ్లుగా కంపెనీ క్వార్టర్లలో నివాసం ఉంటూ పనులకు వెళ్తున్నారు. స్వస్థలంలో ఎలాంటి పనులు లేకపోవటంతో నాలుగేళ్ళ క్రితం వలస కార్మికులుగా వచ్చి పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, పెద్దకుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. ప్రవీణ్‌ చదువు పూర్తి చేసి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రవీణ్‌ ముఖేష్‌కు సాయంగా వెళ్లి మృతి చెందడంతో పుల్లయ్య, విజయమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement