వైభవంగా ప్రసన్నాంజనేయుని తిరునాళ్ల
యడ్లపాడు: మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేట పంచాయతీలో కొలువుదీరిన ప్రసన్నాంజనేయ స్వామి 41వ తిరునాళ్ల మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. గోపాలపురం, చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామాల నడుమ, కొండవీడు కొండల్లో వెలసిన ఈ స్వామివారి ఆలయానికి వేకువజాము నుండే భక్తుల రద్దీ నెలకొంది. వివిధ మొక్కులు చేసుకున్న భక్తులు చిన్న చిన్న ప్రభలతో కుటుంబ సమేతంగా జై హనుమాన్ నామస్మరణ చేస్తూ కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కొండ కింద పొంగళ్లను పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులే కాకుండా సుదూర ప్రాంతాలకు చెందినవారు పెద్దఎత్తున తరలివచ్చారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వాహకులు ఆలయానికి కొత్తరంగులు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ గావించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. చెంఘీజ్‌ఖాన్‌పేట, సొలస, కొత్తసొలస, గోపాలపురం గ్రామస్తులు సమష్టిగా నిర్వహిస్తున్న ఈ తిరునాళ్ల మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులకు మహా అన్న సంతర్పణ గావించారు. రాత్రికి చెంఘీజ్‌ఖాన్‌పేట, సొలస, సంక్రాంతిపాడు గ్రామాల నుంచి భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. వీటితో పాటు సొలస గ్రామప్రభను గ్రామపెద్దలు తీసుకువచ్చారు. తిరునాళ్ల సందర్భంగా ప్రభల వద్ద ఆధ్మాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేశారు. పోలీసులు తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైభవంగా ప్రసన్నాంజనేయుని తిరునాళ్ల
Comments
Please login to add a commentAdd a comment