సీఐ ‘గన్‌’ కార్యం..! | - | Sakshi
Sakshi News home page

సీఐ ‘గన్‌’ కార్యం..!

Published Wed, Mar 26 2025 1:41 AM | Last Updated on Wed, Mar 26 2025 1:39 AM

సీఐ ‘గన్‌’ కార్యం..!

సీఐ ‘గన్‌’ కార్యం..!

ఫిరంగిపురంలో ఓవర్‌ యాక్షన్‌
● అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న ఖాకీలు ● అధికార పార్టీకి కొమ్ముకాసి వీఆర్‌ బాట పడుతున్న వైనం ● సివిల్‌ పంచాయితీలలో తలదూర్చి శాఖకు చెడ్డపేరు ● రేంజ్‌ పరిధిలో అడ్డగోలు బదిలీలు, వీఆర్‌లు ● పది నెలల్లో ఒకే స్టేషన్‌కు ముగ్గురు సీఐలు ● కూటమి సర్కారు వచ్చాక ఎల్లో పైరవీలదే రాజ్యం

సాక్షి ప్రతినిధి, గుంటూరు, నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ నాయకులను పట్టుకుని పోస్టింగ్‌లు తెచ్చుకున్న సీఐలు కొందరు స్వామిభక్తిని ప్రదర్శిస్తూ ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు. మరికొందరు అడ్డంగా దొరికిపోయి వీఆర్‌ బాట పడుతున్నారు. తాజాగా ఫిరంగిపురంలో సీఐ రవీంద్రబాబు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థల వివాదంలో ఫిర్యాదు చేసిన వారిపైనే దాడికి తెగబడటం, వారికి సినీఫక్కీలో గన్‌ గురిపెట్టడం, ఒక యువకుడిని గన్‌తో కొట్టి గాయపరచడం జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. ఈ అధికారి సివిల్‌ పంచాయితీలో తలదూర్చి రెచ్చిపోవడం ఇది రెండోసారి.

గతంలో గోడను పడగొట్టించిమరీ..!

గతంలో పొనుగుపాడు గ్రామంలో దళితులకు సంబంధించిన స్థలంలో గోడను పడగొట్టించి మరీ ఈ సీఐ రోడ్డు వేయించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డైమండ్‌బాబుపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గ్రామస్తుల చేతిలో తన్నులు తినే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ అధికారిని వెనకేసుకొస్తారా, లేక చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

25 మంది వీఆర్‌లో..

ప్రస్తుతం రేంజ్‌లో సుమారు 25 మందికి పైగా సీఐలు వీఆర్‌లో ఉన్నారు. వీరంతా కూడా కూటమి అధికారంలోకి వచ్చాక వీఆర్‌కు వెళ్లిన వారే. సీఐల పోస్టింగులలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. మిగిలిన వారిని వీఆర్‌కు పిలవడం లేకపోతే ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు కట్టబెట్టడం చేస్తున్నారు. లూప్‌లైన్‌ పోస్టింగ్‌లు ఇచ్చినా చిన్నచిన్న కారణాలతోనే వారిని పక్కన పెట్టారు.

బూట్లతో డెప్యూటీ సీఎం వద్దకు వెళ్లారని వీఆర్‌కు..

జనసేన కార్యాలయంలో డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ దీక్షలో ఉండగా బూట్లతో లోపలికి వెళ్లారంటూ మంగళగిరి పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపడం కూటమి ప్రభుత్వ విధానాలకు పరాకాష్టగా నిలిచింది. కొన్ని స్టేషన్లకు సీఐగా వస్తే ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి ఉంది. పట్టాభిపురంలో ఇప్పటికి నలుగురు సీఐలు మారారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాభిపురం స్టేషన్‌కు సీఐగా కిరణ్‌ వచ్చారు. అతను ఎమ్మెల్యే భర్త ఆదేశాల మేరకు వేరే వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టడంతో అతనిని వీఆర్‌కు పంపారు. తర్వాత వీరేంద్రబాబు వచ్చీరాగానే సివిల్‌ పంచాయితీలలో వేలుపెట్టారు. విపక్ష నాయకులే టార్గెట్‌గా కేసులు పెట్టి వేధింపులకు దిగారు. అయితే అతన్ని కూడా వీఆర్‌కు పంపించి మధుసూదన్‌కు డీవో ఇచ్చారు. అతను విధుల్లో చేరిన 24 గంటల్లోనే పోస్టింగ్‌ నిలిపేసి గాల్లో పెట్టారు. అరండల్‌పేట స్టేషన్‌కు కూడా ఇద్దరు సీఐలు మారారు. మొదట కుంకా శ్రీనివాసరావును తీసుకురాగా బోరుగడ్డ అనీల్‌ కేసులో వీఆర్‌కు పంపించి వీరాస్వామిని తీసుకువచ్చారు. నగరంపాలెం స్టేషన్‌కు మొదట మధుసూధనరావును తీసుకురాగా తర్వాత నాయక్‌, ప్రస్తుతం నజీర్‌బేగ్‌ను తీసుకొచ్చారు.

● తాజాగా రెండు రోజుల క్రితమే అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్‌పై వేటు పడింది. గ్రంధశిరి గ్రామంలో జరిగిన వివాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఒక నిందితుడు తప్పించుకుపోయేలా వ్యవహరించిన అంశంలో వీఆర్‌కు పిలిచారు. ఇలా రేంజ్‌ పరిధిలో మారిన వారి సంఖ్య చాలా ఉంది. ఈ మూడు ముక్కలాటపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ‘రేంజ్‌’ వేరు..!

సీఐల బదిలీలు, వీఆర్‌ విషయంలో గుంటూరు రేంజ్‌ కొత్త ట్రాక్‌ రికార్డును నెలకొల్పింది. గుంటూరు రేంజ్‌ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ వచ్చిన తర్వాత పలువురు సీఐలను బంతాట ఆడుతున్నారు. సరిగ్గా పది నెలలు క్రితం సుమారు 13 మందికిపైగా సీఐలను పోలీస్‌స్టేషన్ల (పీఎస్‌)కు బదిలీ చేశారు. అయితే వీరు బాధ్యతలు స్వీకరించక ముందే వెనక్కి పిలిచారు. కొందరు సీఐలు బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిల్లోనే వెయిటింగ్‌, వేకెన్సీ రిజర్వ్‌ (వీఆర్‌)లోకి వెళ్తున్నారు. కొంతమందికి పోస్టింగ్‌ ఇవ్వగానే కూటమికి చెందిన పచ్చపత్రికల్లో, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలవుతోంది. గత ప్రభుత్వానికి అంటకాగారని, వారికి పోస్టింగ్‌ ఇవ్వడమేమిటంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు వస్తాయి. వెంటనే వారిని వీఆర్‌కు పిలుస్తున్నారు. ఇలా వెళ్లిన వారికి నెలలు గడిచినా పోస్టింగ్‌లు ఉండటం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement