
భోగాపురం: భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి వచ్చే నెల మే 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి చేతులమీదుగా జరగనున్న శంకుస్థాపనకు, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సభాస్థలి ప్రదేశం ఖరారైంది.
భోగాపురం మండలం ఎ.రావివలస, సవరవిల్లి గ్రామాల వద్ద విమానాశ్రయ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నా రు. అనంతరం అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే రూ.194 కోట్లతో తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులకు, చింతపల్లి జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక పాటిల్ పరిశీలించారు. సభా వేదిక, వీఐపీ గ్యాలరీ, పైలాన్, వాహ నాలకు పార్కింగ్ తదితర అంశాలపై చర్చించి స్థలాలను ఖరారు చేశారు.