ఈ బడ్జెట్ మాకొద్దు
పార్వతీపురంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌లో పార్వతీపురం మన్యం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, ప్రజా సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధుల మంజూరులో రిక్తహస్తం చూపిందని సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎం.కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు నిరసనగా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సీపీఎం నాయకులతో కలిసి శనివారం ఆందోళన చేశారు. జిల్లాకు నిధులు మంజూరులో అన్యాయం చేశారని, న్యాయం చేయాలంటూ డీఆర్వో కె.హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, పార్వతీపురం, పాలకొండ, కురుపాంలలో పీజీ కాలేజీలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సీతంపేట, సాలూరు, కురుపాంలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలన్నారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించాలన్నారు. జంఝావతి, అడారుగెడ్డ, తోటపల్లి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు, గిరిజన ప్రాంతంలో మినీ రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. గుమ్మడిగెడ్డ రిజర్వాయర్‌ను ఆధునీకరించేందుకు రూ.2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ సుగర్, జీగిరాం జ్యూట్ మిల్లును ప్రభుత్వమే నడపాలన్నారు. రామభద్రపురం నుంచి కూనేరు వరకు రోడ్డు వెడల్పుచేసి కోటిపాం వద్ద జంఝావతిపై బ్రిడ్జి నిర్మించాలన్నారు. పూర్ణపాడు–లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు కేటాయించాలని కోరారు. నాగావళి, జంఝావతి నదులు చెంతనే ఉన్నా పార్వతీపురం పట్టణానికి రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడాన్ని తప్పుబట్టారు. పార్వతీపురం పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్న హామీని బడ్జెట్‌లో విస్మరించారన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.వెంకటరమణ, కె.సాంబమూర్తి, వి.ఇందిర, ఆర్.శ్రీదేవి, బి.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాకు తీరని అన్యాయం
సంక్షేమం లేదు.. సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ ఊసేలేదు
సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
Comments
Please login to add a commentAdd a comment