కూటమి మోసాలపై పోరుబాట
● ‘యువత పోరు’ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
పాలకొండ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హమీలపై పోరుకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 12న చేపడుతున్న యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పాలకొండలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే రూ.3వేలు నిరుద్యోగభృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు నిలువునా ముంచేశారన్నారు. తల్లికి వందనం కింద ప్రతివిద్యార్థికి రూ.15వేలు అందిస్తామని చెప్పి ఒక్కపైసా ఇవ్వకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దీనంగా మారిందని వాపోయారు.
మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కలిసికట్టుగా అడ్డుకుందామని పిలుపునిచ్చారు. యువపోరును విజయవంతం చేయాలని యువత, విద్యార్థుల తల్లితండ్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ రౌతు హనుమంతురావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మథరావు, పాలవలస దవళేశ్వరరావు, నీలాపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment