సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్‌ఎస్‌కు 136 వినతులు
పార్వతీపురంటౌన్: పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన వినతులపై అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 136 మంది అర్జీదారుల నుంచి వినతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరారు. అర్జీదారుల విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి అర్జీదారులను న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దిగువస్థాయి అధికారులను పంపి మొక్కుబడిగా పరిష్కారం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.
పీజీఆర్‌ఎస్‌లో అందిన వినతుల్లో కొన్ని..
● పాచిపెంట మండలం కీరంగి నుంచి గ్రామ సర్పంచ్ లచ్చయ్య అర్జీని అందిస్తూ తమ మండల పరిధిలో చెక్‌డ్యామ్‌లు పాడైనందున వ్యవసాయానికి సాగునీరు అందడం లేదని చెక్‌డ్యాంలు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
● పాలకొండ మండలం వాటపాగు నుంచి ఆర్.దుర్గాప్రసాదరావు దరఖాస్తులు అందిస్తూ తమ గ్రామంలో సర్వే నంబర్ 42–37లో తన వాటాగా సంక్రమించిన భూమిలోని ఐదు సెంట్లు జి. గౌరునాయుడు కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు.
● సాలూరు మండలం పెద్దవలస గ్రామానికి చెందిన కె.బంగార్రాజు తమ గ్రామంలో తన భూమి అన్యాక్రాంతమైందని, న్యాయం చేయాలని కోరాడు.
● జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన సాయిగీత వ్యవసాయ డిప్లమో చేసి ఖాళీగా ఉన్నానని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్‌చార్జ్ జేసీ హేమలత, ఎస్‌డీసీ పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్, పశుసంవర్ధకశాఖాధికారి మన్మథరావు, డ్వామాపీడీ కె.రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో సమస్యల పరిష్కారానికి చర్యలు
పార్వతీపురం రూరల్: సకాలంలో ఫిర్యాదు దారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి నిర్వహించారు. ఈ పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి నేరుగా ఎస్పీ వారితో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేదింపులు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసాలు, ప్రేమపేరుతో వంచన వంటి పలు సమస్యలపై ఫిర్యాదు దారులు ఎస్పీకి విన్నవించారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి ఫిర్యాదులు వాస్తవాలు అయినట్‌లైతే చట్టపరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.
ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్‌కు 61 వినతులు
సీతంపేట: ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 61 వినతులు వచ్చాయి. ఈతమానుగూడ గ్రామానికి చెందిన ఎస్.సింహాచలం వైద్యశాఖలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఎర్రకువ్వారి గ్రామానికి చెందిన త్రినాథ్ అడ్వెంచర్ పార్కులో షాపుపెట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలని విన్నవించాడు. కుశిమి గ్రామస్తుడు నిమ్మక వరహాలు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. డెప్పిగూడ గ్రామస్తురాలు నిమ్మక కల్యాణి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జాబ్ ఇప్పించాలని వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్, డిప్యూటీ ఈవో ప్రసన్నకుమార్, పశుసంవర్థకశాఖ ఎ.డి శ్రీనివాసరావు, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
Comments
Please login to add a commentAdd a comment