పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని, ప్రతీ ఏడాది వలే ఈ ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈఓ, ఎంఈఓలు, హెచ్‌ఎంలతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు ఇంకా 15 రోజులే గడువు ఉన్నందున విద్యార్థులు బాగా చదివేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాత్రి వేళల్లో విద్యా ర్థుల ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల గ్రేడింగ్ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలని అన్నారు. పరీక్షలకు కొద్ది రోజులే సమయం ఉన్నందున తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్లస్టర్ రిసోర్సుపర్సన్లతో మోడల్ పాఠాలను తయారీ చేసి ఉత్తమ బోధన చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,455 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో పక్కా ఏర్పాట్లు చేసి పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఎస్కార్ట్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని విద్యా శాఖాధికారులకు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యా శాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నీతి మాలిన కూటమి పాలన
● మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
జియ్యమ్మవలస రూరల్: రాష్ట్రంలో కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి మాలిన పాలన సాగిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. చినమేరంగిలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆమె ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పాలన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమ న్నారు. అబద్ధపు హామీలతో అడ్డదారిలో అధికారం చేపట్టి నేడు ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని అన్నా రు. కూటమి పాలన చూసి దేశంలో ఇతర రాజకీయ పార్టీలు సిగ్గు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 20న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్ష
పార్వతీపురం టౌన్: జిల్లాలో నాలుగు ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈఓ ఎన్.తిరుపతినాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గల సాలూరు, మక్కువ, కురుపాం, భామిని ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐన్ ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వ్యాయామ ఉపాధ్యాయుల
సంఘ ఎన్నిక
విజయనగరం: జిల్లా వ్యాయామ ఉపాధ్యాయు ల సంఘం అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎన్నికయ్యారు. పువ్వాడ స్కూల్లో ఆదివారం జరిగిన విజయనగరం జిల్లా వ్యాయామ సంఘ ఎన్నికలలో నూతన కార్యవర్గం ఎన్నికై ంది. 251 మంది పీడీ, పీఈటీలు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర నాయకులు ఎంవి.రమ ణ, సాంబమూర్తి వ్యవహరించారు. కొత్త కార్యవర్గ సభ్యులకు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాయామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment