శ్రీరాముడే ఆదర్శం
● సర్వజీవరాశులను కాపాడే బాధ్యత మనుషులదే.. ● త్రిదండి చినజియర్ స్వామి
ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తున్న చినజియర్ స్వామి
పార్వతీపురం: ప్రతి ఒక్కరూ శ్రీరాముడును ఆదర్శంగా తీసుకొని కుటుంబ, రాజ్యవ్యవస్థను నిర్వహించాలని త్రిదండి చినజియర్ స్వామి పిలుపునిచ్చారు. సర్వజీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనన్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం వైభవంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న చినజియర్ స్వామి మాట్లాడుతూ పూర్వం సంప్రదాయలకు విలువ ఇచ్చేవారని, అందుకే వారంతా ఎంతో సుఖసంతోషాలతో జీవించేవారన్నారు. గత సంప్రదాయాలు నేర్పకపోవడం కారణంగా భావితరాల పిల్లలు తప్పులు చేస్తున్నారని, దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో జీవించే ప్రతిఒక్కరూ మంచిని కోరుకోవాలన్నారు. సర్వమానవాళి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులను బతికిస్తూ మనం బతకాలన్నారు. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల మానవుడు తనను తనే విధ్వంసం చేసుకుంటున్నాడన్నారు. పార్వతీపురంలోని జట్టు ఆశ్రమం నిర్వాహకురాలు పద్మజ చెత్తాచెదారాలను సేకరించి సంపదను సృష్టించడం వల్ల పర్యావరణం అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేస్తున్నారన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం పూజలను జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. పలువురు చిన్నారులు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయుడు, పద్మావతి, లక్ష్మీ తదితర వేషధారణలతో అలరించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కల్యాణమండపంలో భక్తులకు తీర్థం
పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో ఉన్న కల్యాణమండపంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చినజియర్ స్వామి స్వహస్తాలతో భక్తులందరికీ తీర్థం ఇచ్చారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ దంపతులు, పార్వతీపురం అడిషనల్ జిల్లా జడ్డి ఎస్.దామోదర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, న్యాయవాదులు టి.జోగారావు, వెంకటరావు, వైద్యులు డి.రామ్మోహనరావు, యాళ్ల వివేక్, పద్మజ, పి.వసంతకుమార్, జి.వాసుదేవరావు, వ్యాపారులు, నారాయణసేవకులు తీర్థగోష్ఠిలో పాల్గొన్నారు.
శ్రీరాముడే ఆదర్శం
శ్రీరాముడే ఆదర్శం
శ్రీరాముడే ఆదర్శం
శ్రీరాముడే ఆదర్శం
Comments
Please login to add a commentAdd a comment