వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ
పార్వతీపురంటౌన్: జిల్లాలోని వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వసతి గృహాల పనితీరుపై గురువారం సమీక్షించారు. మెనూ అమలు, బోధన, తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ తదితర అంశాలపై సహాయ సంక్షేమ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. పల్లె నిద్రలో భాగంగా వసతిగృహాల పరిశీలనలో మంజూరు చేసిన పనుల పురోగతి, పూర్తి కావలసిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ చంద్రబాబు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సాధికారత అధికారి ఎం.డి. గయాజుద్దీన్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎస్.కృష్ణ పాల్గొన్నారు.
సెల్ టవర్ల ఏర్పాటు స్థలాలు గుర్తించాలి
జిల్లాలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సెల్ టవర్ల ఏర్పాటుపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాలకు తొలుత ప్రాధాన్యమివ్వాలన్నారు. అవసరమైతే అటవీశాఖ అధికారులతో మాట్లాడతానన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో కె.హేమలత, సాలూరు, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి వనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీఎం జన్‌మాన్, పల్లె పండగ పనుల పురోగతిపై అధికారులతో గురువారం సమీక్షించారు. కొత్తగా మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 56 పనులకు సమగ్ర అంచనాలను సిద్ధంచేసి నివేదిక అందజేయాలని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment