ఆయుష్‌శాఖలో సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

ఆయుష్‌శాఖలో సిబ్బంది కొరత

Published Fri, Mar 7 2025 9:44 AM | Last Updated on Fri, Mar 7 2025 9:40 AM

ఆయుష్‌శాఖలో సిబ్బంది కొరత

ఆయుష్‌శాఖలో సిబ్బంది కొరత

హోమియో, ఆయుర్వేదం, యూనాని విభాగాల్లో వైద్యులు, పారామెడికల్‌

సిబ్బంది అవసరం

ఇబ్బందులు పడుతున్న రోగులు

విజయనగరం ఫోర్ట్‌: అల్లోపతి వైద్యం చేయించుకోవడానికి కొంతమంది అసక్తి చూపుతుండగా, మరి కొంతమంది ఆయుష్‌ వైద్యం పట్ల అసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆయుష్‌శాఖలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీంతో రోగులకు వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయుష్‌శాఖ పరిధిలో హోమియో, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి విభాగాలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల హోమియో డిస్పెన్సరీలు ఉండగా, మరి కొన్ని చోట ఆయుర్వేదం డిస్పెన్సరీలు, యునాని, నేచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. వైద్యసిబ్బంది కొరత అధికంగా ఉన్నప్పటికీ కూటమి సర్కార్‌ ఖాళీలు భర్తీ చేయకుండా అలసత్వం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హోమియోలో 22 ఖాళీలు

హోమియో విభాగంలో 16 డిస్పెన్సరీలు ఉన్నాయి. 16మంది వైద్యులకు గాను 13 మంది ఉన్నారు. మూడు వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంపౌండర్లు 16 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉన్నారు. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వీపర్‌కమ్‌ స్కావెంజర్‌ పోస్టులు 16 పోస్టులకు గాను ఏడుగురు ఉన్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆయుర్వేదంలో..

ఆయుర్వేదం శాఖలో 16 డిస్పెన్సరీలు ఉన్నాయి. 16మంది వైద్యుల పోస్టులకు గాను 15 మంది ఉన్నారు. ఒక వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. కాంపౌండర్‌ పోస్టులు ఏడుకుగాను ఇద్దరు ఉన్నారు. ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్‌ఎం పోస్టులు 8కి గాను ఇద్దరు ఉన్నారు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్‌ పోస్టులు ఐదుకుగాను ఐదు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ ఆర్డర్లీ ఏడుకుగాను నలుగురు ఉన్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్పెన్సరీ మూడు పోస్టులకు మూడు ఖాళీగా ఉన్నాయి. మెటర్నిటీ అసిస్టెంట్‌ ఒక పోస్టుకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉంది

నేచురోపతిలో..

నేచురోపతి డిస్పెన్సరీలు మూడు ఉన్నాయి. ముగ్గురు వైద్యులకుగాను ముగ్గురు ఉన్నారు. కాంపౌండర్లు ముగ్గురికి గాను ఒక్కరే ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులు మూడుకు గాను ఇద్దరు ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది.

యునానిలో..

యునాని డిస్పెన్సరీలు రెండు ఉన్నాయి. ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. కాంపౌండర్‌ పోస్టులు రెండుకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. స్వీపర్‌ కమ్‌ స్కావెంజర్‌ ఒక పోస్టుకుగాను ఒక్కరు ఉన్నారు.

ఆయుష్‌శాఖలో వివిధ వ్యాధులకు చికిత్స

ఆయుష్‌శాఖలో ఉన్న హోమియో, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి విభాగాల ద్వారా వివిధ వ్యాధులకు వైద్యసేవలు అందిస్తారు. చర్మవ్యాధులు, పక్షవాతం, కీళ్లవాతం, నడుంనొప్పి, బీపీ, సుగర్‌, ఊబకాయం, సైనసైటిస్‌, ఆస్తమా, మూత్ర సంబంధిత, సొరియాసిస్‌, కామెర్లు తదితర వ్యాధులకు చికిత్స అందజేస్తారు.

సిబ్బంది కొరత వాస్తవం

ఆయుష్‌శాఖలో పారామెడికల్‌ సిబ్బంది కొరత ఉంది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై నివేదిక ఉన్నతాధికారుల వద్ద ఉంది.

డాక్టర్‌ జి.వరప్రసాద్‌,

సీనియర్‌ హోమియో వైద్యాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement