పూసపాటిరేగ: సంక్షేమ వసతిగృహాల నిర్వహణపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. వసతిగృహాలలో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు మంజూరు చేయాల్సిన డైట్ చార్జీల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత సెప్టెంబర్ నెల నుంచి ఆరు నెలలుగా బీసీ సంక్షేమ వసతిగృహాలకు మంజూరు చేయాల్సిన డైట్ చార్జీలు మంజూరు చేయకపోవడంతో సంబంధిత అధికారులు అప్పులు చేసి మరీ వసతిగృహాలను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక సమస్యలతో సతమతం కావడంతో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పక్కాగా అమలు చేయలేని దుస్థితి ఏర్పడింది. జిల్లాలో 52 బీసీ సంక్షేమ వసతిగృహాలుండగా వాటిలో సుమారు 3,522 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాటలు వేసే వసతిగృహాల నిర్వహణపై సర్కారు నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వంలో డైట్ చార్జీలు ప్రతి రెండు నెలలకోసారి ఠంచన్‌గా మంజూరు చేసేవారు. ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా డైట్ చార్జీలు మంజూరు చేశారు. నాడు – నేడు పనులలో భాగంగా వసతిగృహాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం మారాక అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరగడం, చాలీచాలని డైట్ చార్జీలతో వసతిగృహాల నిర్వహణ అంతంతమాత్రంగా మారింది. ఇప్పటికై నా సంక్షేమ పథకాల ఊసెత్తని సర్కారు కనీసం వసతిగృహ విద్యార్థులకై నా న్యాయం జరిగేలా డైట్ చార్జీలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment