
మహిళా సాధికారతే ధ్యేయం
పార్వతీపురంటౌన్: మహిళా సాధికారతకు ప్రభు త్వం కృషిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదని గుర్తుచేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ఉన్నతమైన స్థానాల్లో నిలిచారని ఆమె గుర్తుచేశారు. భారత రాష్ట్రపతి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు మహిళలేనన్నారు. వివిధ రంగాల్లో రాణించిన, సేవలందించిన మహిళలకు కలెక్టర్, పార్వతీపురం ఎమ్మెల్యే బి.విజయచంద్రతో కలిసి జ్ఞాపిక, శాలువ, ధ్రువీకరణ పత్రాలతో సత్కరించారు. వాలీబాల్, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
వీడీవీకే ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో వీడీవీకేలు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇక్కడి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పా రు. మూఢనమ్మకాలు, బాల్యవివాహాల నిర్మూలనకు గ్రామస్థాయి కమిటీలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. మహిళలందరూ కలిసి ఎనీమియా ముక్త్ పార్వతీపురంను చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు పథక సంచాలకులు సుధారాణి, వై.సత్యంనాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుపతి నాయుడు, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.వి.కరుణాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.కృష్ణ్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్ భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు, జట్టు ఆశ్రమం నిర్వాహకురాలు వెలిగొండ పద్మజ, చేనేత, జౌళిశాఖ సహాయ అభివృద్ధి అధికారి ఎన్.వెంకటరమణ, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవం
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment