● నిర్వాసితులను మోసం చేయడం అన్యాయం ● ఎంపీ మాట మార్చడం బాధాకరం ● 27, 28వ తేదీల్లో నిరాహార దీక్షలు ● మూడవ రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు శ్రీనివాస్
గజపతినగరం: టిట్లాగర్ నుంచి విజయనగరం వరకు సుమారు 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదని, సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెబుతామని రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు జి.శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో మూడో రైల్వే లైన్ నిర్మాణంలో ముందుగా 14 ఇళ్లకు అరకొర డబ్బులు చెల్లించి వాటిని కూల్చివేశారని, తరువాత మరో 28 కుటుంబాలకు చెందిన వారి ఇళ్లను కూల్చి వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. నిర్వాసితులకు నిలువునీడ చూపకుండా ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బాధితులకు న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. నిర్వాసితుల పక్షాన కాకుండా ఇళ్లను కూల్చే కాంట్రాక్టర్ తరఫున కొమ్ముకాయడం దారుణమన్నారు. తక్షణమే నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మార్చి 27, 28 తేదీల్లో మానాపురం బ్రిడ్జి సమీపంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే ఏప్రిల్ 2వ తేదీన చలో తహసీల్దార్ ఆఫీస్ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో నిర్వాసితుల కమిటీ నాయకులు చిల్లా గోవింద్, బోర మహేష్, నగిరెడ్ల రాము, తదితరులు పాల్గొన్నారు.