
బస్సు ఢీకొని తండ్రీకొడుకుల మృతి
బలిజిపేట: మండలంలోని వంతరాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట గ్రామానికి చెందిన ముడుసు రామయ్య(30), కుమారుడు పవన్‌కుమార్(3) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజాం నుంచి ఆటో డ్రైవింగ్ చేసుకుని వస్తుండగా వంతరాం గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామయ్య బలిజిపేట గ్రామానికి చెందిన యాదవ కుటుంబీకుడు. ఆయన ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం కుమారుడిని తీసుకుని రాజులమ్మ యాత్రకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వంతరాం సమీపంలో జరిగిన బస్సు ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో భార్య భవాని, కూతురు రమ్య, కుటుంబసభ్యులు, బంధువులు లబోదిబోమని రోదిస్తున్నారు. రామయ్యకు ఉండడానికి కనీసం ఇల్లుకూడా లేదని, భార్య, కూతురికి ఆరోగ్యం బాగోలేకపోతే రాజులమ్మ మొక్కుతీర్చుకుని వస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని భావించిన తండ్రి భార్యను, ఆడపిల్లను ఇంటివద్ద ఉంచి, కొడుకును తీసుకుని వెళ్లాడని బంధువులు తెలిపారు. కుటుంబయజమాని మృతితో భార్య, ఆడపిల్ల నడిరోడ్డున పడ్డారని వాపోతున్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య భవాని ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం తరలించినట్లు చెప్పారు.
చెట్టును ఢీకొని టిప్పర్ డ్రైవర్..
రేగిడి: మండల పరిధిలోని రెడ్డిపేట జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ చెట్టును ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. దీనిపై ఎస్సై పి.నీలావతి అందించిన వివరాల ప్రకారం ఆమదాలవలస వద్ద ఉన్న ముద్దాడపేట ర్యాంప్ నుంచి ఇసుకను తీసుకువెళ్లేందుకు సాలూరు నుంచి డ్రైవర్ టిప్పర్‌తో వస్తున్నాడు. రాజాం నుంచి పాలకొండ వైపు వేకువజామున 3గంటల సమయంలో మలుపు వద్ద వాహనం అదుపుచేయలేక చెట్టును బలంగా ఢీకొన్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో గాయాలపాలైన డ్రైవర్ తన ఫోన్‌లో మిగిలిన డ్రైవర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న వారంతా కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడిని అనకాపల్లి జిల్లా కోడూరు మండలం గొల్లపేటకు చెందిన పల్లా నాగరాజు (30)గా గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతుడి చిన్నాన్న దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తున్నామన్నారు. మృతుడికి భార్య హేమవర్షిణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సీహెచ్‌సీకి తరలించామన్నారు.
లారీ కింద పడి వ్యక్తి..
కొమరాడ: మండలకేంద్రం కొమరాడ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తవలస గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మణ్(55)లారీ చక్రాల క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న లారీ రహదారి పక్కగుండా నడిచి వెళ్తున్న లక్ష్మణ్‌ను ఢీకొంది. దీంతో కింద పడిన లక్ష్మణ్ పై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో నుజ్జునుజ్జై పోయాడు. మృతుడికి నలుగురు పిల్లలు, భార్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

బస్సు ఢీకొని తండ్రీకొడుకుల మృతి

బస్సు ఢీకొని తండ్రీకొడుకుల మృతి

బస్సు ఢీకొని తండ్రీకొడుకుల మృతి