
స్వచ్ఛంద భూదానోద్యమం రావాలి
● ఆచార్య వినోబా భావేకు లోకసత్తా ఘనంగా నివాళి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో స్వచ్ఛంద భూదానోద్యమానికి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్ధలు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వచ్ఛంద భూదాన ఉద్యమం సృష్టికర్త స్వాతంత్య్ర సమరయోధుడు, ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన ఉద్యమం 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినోబాభావే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ.. వినోబా భావే పాదయాత్ర చేస్తూ..1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో స్వచ్ఛంద భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి అక్కడ జమీందారు వెదిరే రామచంద్రారెడ్డి మనసును గెలిచి వంద ఎకరాల భూమిని దానంగా స్వీకరించారన్నారు. తెలంగాణలో 1.30లక్షల ఎకరాలు, ఆంధ్రాలో 80 వేల ఎకరాలు వినోబా భావే సేకరించినవి ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రెండు లక్షల యాభై ఎకరాలు పేద ప్రజలకు దాదాపు 50లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించి 1965లో అప్పటి ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో భూదాన్ గ్రామ్‌దాన్ చట్టం వచ్చేలా చేశారని కొనియాడారు. తన తాత స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్గీయ భీశెట్టి అప్పారావు అనకాపల్లి శాసనసభ్యుడిగా వినోబా భావే స్ఫూర్తితో స్వచ్ఛంద భూదాన్ ఉద్యమంలో పాల్గొని పేదలకు భూములు పంచారని భీశెట్టి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లంశెట్టి నాగభూషణం, థాట్రాజు రాజారావు, బోరరమేష్, పౌరవేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్ర రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.