పెద్దపల్లి: తండ్రిని కిరాతకంగా హతమార్చిన ఓ తనయుడికి పెద్దపల్లి న్యాయస్థానం జీవితఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. వివరా ల్లోకి వెళ్తే.. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్‌కు చెందిన కత్తెర్ల మహేశ్ డిగ్రీ ఫెయిలయ్యి, పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో 7–5–2021 రోజున అతని తండ్రి లచ్చయ్య మందలించాడు.
తన మిత్రులు, చుట్టుపక్కనున్నవారి ముందు ఇలా చేయడాన్ని మహేశ్ అవమానంగా భావించాడు. అదేరోజు రాత్రి ఆరుబయట త్రండి మంచం పక్కనే మరో మంచం వేసుకొని, నిద్రించాడు. అర్ధరాత్రి లేచి, పక్కనున్న రోకలి బండతో లచ్చయ్యపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్‌హెచ్‌వో కేసు నమోదు చేయగా సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
నేరం రుజువు కావడంతో మహేశ్‌కు న్యాయమూర్తి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ మహేశ్‌ల పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన ఎస్సై వెంకటకృష్ణ, సీఐ జగదీశ్, సుల్తానాబాద్ సీడీవోలు శ్రీనివాస్, సందీప్, లైసన్ అధికారి హెచ్‌సీ కోటేశ్వర్‌రావులను సీపీ రెమారాజేశ్వరి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment