
గుండెనొప్పంటే..
పేషెంట్ పరిస్థితి అదుపులో ఉన్నా.. ఆపరేషన్‌కు సమయం ఉన్నా పట్టించుకోని కొందరు వైద్యులు
‘ఆరోగ్యశ్రీ’ వచ్చేవరకు ఆగితే ముప్పంటూ స్టంట్లు, శస్త్రచికిత్సలు
అప్పులపాలవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు
గత జనవరి నుంచి దాదాపు 2,100 గుండె చికిత్సలు
ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల దందా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎవరైనా గుండె నొప్పంటూ దవాఖానాకు వెళ్తే.. వెంటనే ఆపరేషన్లు చేసేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటే పర్వాలేదు. పేషెంట్ పరిస్థితి అదుపులోనే ఉండి, ఆపరేషన్ చేయడానికి లేదా స్టంట్ వేయడానికి తగినంత సమ యం ఉన్నా, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిసినా పట్టించుకోవడంలేదు. అందరినీ ఎమర్జెన్సీ కింద లెక్కగట్టి, స్టంట్లు వేయడం, ఆ పరేషన్ చేస్తున్నారు. దీంతో ఉచితంగా ఆరో గ్యశ్రీ పథకం కింద అందా ల్సిన గుండె వైద్యం కాస్తా.. ఖరీదుగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజలు అప్పుల చేసి మరీ బిల్లు కడుతున్నారు. గత జనవరి నుంచి జూలై వరకు ఉమ్మడి జిల్లాలో జరిగిన గుండె చికిత్సల(స్టంట్లు, ఆపరేషన్లు) సంఖ్య దాదాపు 2,100 అంటే దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా తర్వాత పెరిగిన సమస్యలు..
కరోనా తర్వాత గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. మనుషులు ఉన్నట్లుండి గుండెనొప్పితో కుప్పకూలుతున్నారు. బాధితుల్లో చాలామంది వెంటనే చనిపోతున్నారు. దీంతో గుండె సంబంధిత ఏ సమస్య తలెత్తినా ప్రతిఒక్కరూ వణికిపోతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. సాధారణంగా గుండె నరాల్లో బ్లాకులు ఏర్పడి, స్టంట్ వేయాల్సి రావడం లేదా బైపాస్ సర్జరీ తదితర సమస్యలతో పేషెంట్ ఆస్పత్రి గడప తొక్కితే.. ఎమర్జెన్సీ కేసుల కింద చూపి, వైద్యులు ఆపరేషన్ చేయాలంటున్నారు.
ఆరోగ్యశ్రీ వచ్చే వరకు ఆగితే ప్రాణాలకే ముప్పంటూ ఆందోళనకు గురిచేస్తున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అప్పులు చేసి మరీ శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద ఒక స్టంట్ వేసినప్పుడు సుమారు రూ.60 వేలు, రెండు వేయాల్సి వస్తే.. రూ.లక్ష వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే ప్రైవేటు ఆస్పత్రివారే చేస్తే ఒక స్టంట్‌కు రూ.2 లక్షలు, రెండింటికి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఓపెన్‌హార్ట్ సర్జరీ వంటి వాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.1,18,000 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ, కొన్ని ఆస్పత్రులు రోగి కుటుంబసభ్యులను కంగారు పెట్టి, ఆపరేషన్ చేసి, రూ.3 లక్షలు మొదలుకొని.. నచ్చినట్లు బిల్లులు వేస్తున్నాయి.
బాధితులు ఏం చేయాలి?
ఇలాంటి కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలే గుండె జబ్బులకు చికిత్స పొందుతారు. అలాంటివారు తాము మోసపోయామని అనుమానం వస్తే.. వెంటనే సమీపంలోని ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ లేదా ఆరోగ్యశ్రీ సీఈవోకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో ఆస్పత్రిది తప్పిదమని తేలితే ఆపరేషన్ ఖర్చుకు 20 రెట్ల జరిమానా విధిస్తారు. అలాగే, హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తారు. పరిస్థితిని బట్టి ఆపరేషన్ చేసిన వైద్యుడి డిగ్రీ కూడా రద్దవుతుందని సీనియర్ డాక్టర్లు చెబుతున్నారు.
ఇది అన్యాయం
అసవరం లేకున్నా స్టంట్స్ వేయడం, ఆపరేషన్ చేయడం వంటి ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి. ఇది అన్యాయం. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం పేదవారే వస్తారు. అలాంటి వారిని తప్పుదోవ పట్టించడం సరికాదు. పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేయడం సబబే. కానీ, అన్నింటినీ ఎమర్జెన్సీ కింద జమకట్టి, పేదలను అప్పులపాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ బీఎన్.రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు
అప్రూవల్ వచ్చేదాకా ఆగాలి
హార్ట్‌స్ట్రోక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా చికిత్స అందించాలి. ఎమర్జెన్సీ కానప్పుడు ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చే వరకు ఆగాలి. ఆ పథకం పెట్టిందే నిరుపేదల కోసం. వైద్యులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. ప్రభుత్వ అధికారులు గుండెకు సంబంధించిన కేసులకు వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలి.
– డాక్టర్ రాంకిరణ్, ఐఎంఏ అధ్యక్షుడు, కరీంనగర్

గుండెనొప్పంటే..

గుండెనొప్పంటే..

గుండెనొప్పంటే..
Comments
Please login to add a commentAdd a comment