● పెద్దపల్లి డీసీపీ కరుణాకర్
పాలకుర్తి(రామగుండం): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని, ప్రతీ గ్రామంలో వాటి ఏర్పాటుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు. గురువారం బసంత్‌నగర్ పోలీసుల ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం కుక్కలగూడుర్‌లో ఏర్పాటు చేసిన ‘నేనుసైతం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్ సమాచారం ఇవ్వకూడదన్నారు. యువత మద్యం, గంజాయి, గుట్కా, ధూమపానం వంటి చెడువ్యసనాలకు అలవాటుపడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చదువు, కెరీర్‌పై దృష్టిసారించి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈసందర్భంగా గ్రామంలో స్థానికుల సాయంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ప్రారంభించి గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై స్వామి, మాజీ సర్పంచ్ గోండ్ర చందర్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
23న సామూహిక గీతా పారాయణం
మంథని: సనాతన ధర్మ ప్రచార సమితి, శ్రీసీతారామ సేవాసదన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న మంథనిలోని శివకిరణ్ గార్డెన్స్‌లో 5వేల మందితో సామూహిక గీతాపారాయణం నిర్వహించనున్నట్లు సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంథెన శ్రీనివా్‌స్, ఉత్సవ సమితి అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ, భగవద్గీతను ఇంటింటికీ చేర్చడానికి ఐదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పారాయణానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రవచకులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు పిఠాధిపతులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు శోభాయాత్ర నిర్వహించి గీతాపారాయణం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కొత్త శ్రీనివాస్ గుప్తా, వేడగోని రాజమౌళిగౌడ్, పుప్పాల విక్రమసింహారావు, కొండమేన అశోక్‌కుమార్, బండారి సురేశ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి