ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఆదాయం రూ.500 కోట్లు! | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఆదాయం రూ.500 కోట్లు!

Published Sat, Mar 22 2025 1:52 AM | Last Updated on Sat, Mar 22 2025 1:47 AM

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ మూతబడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో ఎఫ్‌సీఐ కర్మగారాన్ని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారంగా పేరు మార్చి పునరుద్ధరించారు. 22 మార్చి 2021న రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా కిసాన్‌ బ్రాండ్‌ పేరిట వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నులు. 2022 నవంబర్‌ 12న భారత ప్రధాని నరేంద్రమోదీ ప్లాంటును జాతికి అంకితం చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉత్పత్తి చేసిన యూరియాను భారత్‌ బ్రాండ్‌తో మార్కెట్‌ చేస్తున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,941.60 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ.440.96 కోట్ల ఆదాయం(లాభం) సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈక్రమంలోనే ఈసారి రూ.500 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తగ్గిన దిగుమతుల భారం..

దేశీయంగా ఎరువుల కొరత అధికంగా ఉండడంతో కేంద్రప్రభుత్వం దిగుమతి తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ (నాటి ఎఫ్‌సీఐ), గోరఖ్‌పూర్‌(ఉత్తరప్రదేశ్‌), సింద్రీ (జార్ఖండ్‌), తాల్చేర్‌(ఒడిశా) ఎరువుల కర్మాగారాలు పునరుద్ధరించిన వాటిలో ఉన్నాయి. ఇందులోని రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారం ఎరువుల ఉత్పత్తిని 2021 మార్చి 22న, గోరఖ్‌పూర్‌ యూనిట్‌లో 2022 అక్టోబర్‌ 18న, సింద్రీ యూనిట్‌ లో 2022 నవంబర్‌ 05న ఉత్పత్తి ప్రారంభించారు. తాల్చేర్‌ ప్లాంట్‌లో 2025 చివరి నాటికి యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సల్ఫర్‌ కోటెడ్‌ యూరియా

రామగుండం ఎరువుల కర్మాగారంలో రూ.150 కోట్లతో సల్ఫర్‌ యూరియా ఉత్పత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నీమ్‌ కోటెడ్‌ యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. దేశీయంగా వంటనూనెల డిమాండ్‌ అధికంగా ఉండడంతో దాని కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్‌ సాగుకు సబ్సిడీ కల్పించాయి. పామాయిల్‌ సాగుకు ఉపయోగకరంగా ఉండే సల్ఫర్‌ కోటెడ్‌ యూరియాను రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది.

7 రాష్ట్రాలకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూరియా

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాలో 50శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఈ యూరియా సరఫరా చేస్తున్నారు.

50 శాతం యూరియా తెలంగాణ రాష్ట్రానికే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement