
నవజాత శిశు కేంద్రం ప్రారంభానికి చర్యలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఆస్పత్రిలో నవజాతశిశు కేంద్రం ఏర్పాటుకు వచ్చిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలోనే మాతాశిశు ఆస్పత్రిలో నవజాత శిశు కేంద్రం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఐఓిసీఎల్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద పరికరాలు అందించారని తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు అవసరమైన రూ.35 లక్షల విలువ చేసే వివిధ వైద్య పరికరాలు ఆసుపత్రికి చేరుకున్నాయని, వీటిని త్వరగా అమర్చి కేంద్రం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.