
జలం.. గరళం
● పవిత్ర గోదావరిలో కలుస్తున్న వ్యర్థాలు ● నేరుగా తాగేందుకు పనికిరావంటున్న అధికారులు ● ఫిల్టర్ చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ● ఇంకా నిర్మాణ దశలోనే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్
కలుషిత నీటితో ఇప్పటి వరకు నమోదైన కేసులు
హైపటైటిస్ : 6 పాజిటివ్(రెఫరల్) ఆస్పత్రిలో చేరినవారు : 30మంది
గోదావరిఖని: పవిత్ర జలాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యర్థ్యాలు, రసాయనాలు, మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. రంగు, రుచి మారి కంపు కొడుతున్నాయి. ఈ నీరు తాగడానికి కాదు కదా.. రోజూవారి అవసరాలకు కూడా పనికిరాదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నా.. కార్మిక కాలనీలకు గోదావరి నీరు తప్ప మరోమార్గంలేకుండాపోయింది.
నీటికి అడ్డుకట్ట వేసి..
గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల్లోని కార్మిక కుటుంబాలతో పాటు సింగరేణి క్వార్టర్లకు ఆనుకుని ప్రైవేట్‌కాలనీలకూ గోదావరి నీరు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం గోదావరి ఖని సమీపంలోని ఇంటెక్‌వెల్ నుంచి పంపుల ద్వా రా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నది లో నీటి లభ్యత తగ్గింది. ఎగువ నుంచి వచ్చే వ్య ర్థ్యాలు నదిలోని కొద్దిపాటి నీటిలో కలుస్తున్నాయి. ఆ నీటికే అడ్డుకట్ట వేసిన సింగరేణి యాజమాన్యం.. పంపింగ్ చేస్తూ కార్మిక కాలనీలకు తరలిస్తోంది.
బొగ్గు గనుల నీరు కలిపి..
గోదావరిఖని ప్రాంతానికి రోజూ 18 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) యైటింక్లయిన్‌కాలనీకి 8 ఎంఎల్‌డీ, సెంటినరీకాలనీకి 5 ఎంఎల్‌డీ నీటిని యాజమాన్యం అందిస్తోంది. అయితే, గోదావరి నీ రు సరిపోక ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని బొగ్గు గను ల నుంచి వెలువడే నీటిని ఫిల్టర్‌బెడ్‌లో శుభ్రం చేసి సరఫరా చేస్తున్నారు. ఈనీరు జిడ్డుగా ఉంటోందని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నగర మురుగు నదిలోకే..
రామగుండం నగరంలో రోజూ వెలువడే 32 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు గోదావరి నదిలోనే కలుస్తున్నాయి. సీవరేజ్ ప్లాంట్లు ఉన్నా.. జీవితకాలం ముగియడంతో పనిచేయడం లేదు. దీంతో వ్యర్థాలు, డ్రైనేజీ నేరుగా నదిలో కలుస్తున్నాయి. ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు.
నేరుగా ఆర్‌ఎఫ్‌సీఎల్ వ్యర్థాలు కూడా..
ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి వెలువడే వ్యర్థాలు కూడా గో దావరి నదిలో కలుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయి నా, నదీజలాలు విషతుల్యమవుతూనే ఉన్నాయి.
వ్యాధుల బారినపడుతున్న కార్మికులు
గోదావరి నీటిని ఫిల్టర్లలో శుభ్రం చేసి కార్మిక కాలనీలకు పంపింగ్ చేస్తున్నారు. ఫిల్టర్లలో సరిగా శుభ్రంకాక ఆ నీటిని తాగుతున్న వారు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా హైపటైటిస్– ఏతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కలుషిత నీటితోనే హైపటైటిస్ బారిన పడుతున్నారని సింగరేణి వైద్యాధికారి ఉత్తర్వులు జారీచేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
నిర్మాణ దశలో ర్యాపిడ్ గ్రావిటీ
జీడీకే–2ఏ సమీపంలో రూ.14.5 కోట్ల వ్యయంతో 35ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన గ్రావిటీ ఫిల్టర్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తోంది. జూలై వరకు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే మిషన్ భగీరథ తరహాలో కార్మిక కుటుంబాలకు మినరల్ వాటర్ అందుతుంది.

జలం.. గరళం

జలం.. గరళం

జలం.. గరళం