
ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య
గోదావరిఖని: ఎంకాం చదివి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదవి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదని కొంతకాలంగా మదనపడుతోంది. ఇదేవిషయాన్ని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేది. ఈక్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో రేకులషెడ్డు పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం రాలేదని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తన మూడో కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చుంచు విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.