బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలో తొలిసారి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో 40 శాతం కమీషన్ సర్కార్ అధికారంలో ఉందని బీజేపీపై ధ్వజమెత్తారు. ఆప్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ తరహాలో కర్ణాటక వాసులకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మైరుగైన ఆరోగ్య వసతులు కల్పిస్తామని చెప్పారు.
చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కూమారుడు ప్రశాంత్ కుమార్ నుంచి రూ.8.23కోట్ల అక్రమ నగదును లోకాయుక్త అధికారులు సీజ్ చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. అవినీతికి పాల్పడి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికార పార్టీ నేతపై ఎలాంటి చర్యలు తీసుకోని బీజేపీ.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండానే మనీష్ సిసోడియాను అరెస్టు చేసిందని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకకు వచ్చి అవినీతి రహిత పాలన అందిస్తాం, బీజేపీనే గెలిపించండి అని చెప్పిన అమిత్‌షాపై సెటైర్లు వేశారు.
రాష్ట్ర మంత్రులు 40 శాతం కమీషన్ అడుగుతున్నారని కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెంపన్న.. ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని కూడా కేజ్రీవాల్ గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే బీజీపీ ప్రభుత్వంలో అవినీతి డబుల్ అయిందని ఎద్దేవా చేశారు. తమకు ఒక్కసారి అధికారమిస్తే నిజాయితీతో అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామన్నారు.
చదవండి: మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment