చప్రాసీని పెట్టండి.. సమస్యలు చెప్పుకుంటాం | Akbaruddin Owaisi lashed out Telangana government | Sakshi
Sakshi News home page

చప్రాసీని పెట్టండి.. సమస్యలు చెప్పుకుంటాం

Published Sun, Feb 5 2023 5:04 AM | Last Updated on Sun, Feb 5 2023 7:42 AM

Akbaruddin Owaisi lashed out Telangana government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంజూరైన పనులు పూర్తి కావడం లేదు. పాతబస్తీ అభివృద్ధి పనుల గురించి ప్రత్యేక సమావేశం పెడతానని పురపాలక శాఖ మంత్రి చెప్పి ఏడాది గడిచింది. అయినా ఇప్పటికీ సమావేశం జరగలేదు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో తప్ప మిగతా అన్ని దిక్కులా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. కానీ వారెవరూ అందుబాటులో ఉండరు. బీఏసీ సమావేశానికి సభా నాయకుడు రారు. మరి మేం ఎవరిని అడగాలి? తెలంగాణ కోసం.. పాతబస్తీ అభివృద్ధి కోసం మీ చప్రాసిని కలవాలని చెబితే వారినైనా కలుస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

శనివారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అధికారపక్ష సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్దీన్‌ ఒవైసీ... గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గవర్నర్‌ చెప్పిన తీరును మెచ్చుకుంటూనే... కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూ అమలు వంటి అంశాలతోపాటు పాతబస్తీ అభివృద్ధిపట్ల నిర్లక్ష్యంపై సర్కారుకు వరుస ప్రశ్నలు సంధించారు. నాలుగున్నరేళ్లలో అసెంబ్లీ 64 రోజులే నడిచిందని, అధికార పార్టీ సభ్యులంతా అసెంబ్లీలోకన్నా టీవీ చర్చల్లో ఎక్కువ సేపు కూర్చుంటారని విమర్శించారు.

గొంతు చించుకుంటే గొప్పోళ్లు కారు...: కేటీఆర్‌
అక్బరుద్దీన్‌ ప్రసంగం మధ్యలోనే జోక్యం చేసుకున్న మంత్రి కె. తారక రామారావు ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ‘సభలో 105 మంది సభ్యులున్న బీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు సభ్యులు గంట సేపు మాట్లాడితే ఏడుగురు సభ్యులున్న పార్టీకి గంట సమయం ఇస్తే ఎలా ? ఆయన (అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి) బీఏసీకే రారు. వచ్చి ఏదైనా చెప్పినా, విజ్ఞప్తి చేసినా మంత్రులు వింటారు. అక్కడికి రాకపోగా ఈ టర్మ్‌లో అసెంబ్లీనే జరగలేదన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ టర్మ్‌లో రెండేళ్లు కోవిడ్‌కే పోయింది. ఆవేశంగా గొంతు చించుకున్నంత మాత్రాన ఏంరాదు. గొప్పవాళ్లు అయిపోరు. సభా నాయకుడు సభకు రారని మాట్లాడుతున్నారు. సభా నాయకుడితో ఏం సంబంధం? బీఏసీలో నలుగురు మంత్రులు ఉన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై స్పందించకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా? సమయపాలన పాటించాలి’ అని చురలంటించారు.

నేనేం కొత్త సభ్యుడిని కాను: అక్బరుద్దీన్‌
కేటీఆర్‌ వ్యాఖ్యలపై అక్బరుద్దీన్‌ స్పందిస్తూ ‘నేను కొత్త సభ్యుడిని కాదు. చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యా. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు.. రాజ్యంగబద్ధంగా చర్చ జరగాలి. గతంలో ఏపీ శాసనసభలో కూడా గంటలసేపు మాట్లాడాను. రోశయ్య వంటి వారు ప్రశంసించారు. ఎవరూ, ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. 105 మంది సభ్యులు ఉంటే ఎంత సేపైనా టైం తీసుకోండి. వినడానికి కూడా ఓపిక ఉండాలి. వారికి ఓపిక నశించింది’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. గవర్నర్‌ ప్రసంగంపైనే అక్బరుద్దీన్‌ మాట్లాడితే బాగుంటుందని సూచించారు. గతంలో బాగానే మాట్లాడారని, ఇప్పుడే అక్బర్‌కు సహనం తగ్గి, కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. అనంతరం అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ తాను బీఏసీ సమావేశానికి వెళ్లకపోయినా, ఎంఐఎం తరఫున తమ ప్రతిపాదనలను పంపించినట్లు చెప్పారు.

కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్‌ ప్రసంగంలో చేర్చలేదేం?
గవర్నర్‌ ప్రసంగంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును కూడా వివరించి ఉంటే బాగుండేదని అంతకుముందు అక్బరుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. ‘కేంద్రం 157 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని గవర్నర్‌ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. గవర్నర్‌ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ముద్రించడం వల్ల కేంద్రం రాష్ట్రానికి చేసే అన్యాయాన్ని ప్రస్తావించడం మర్చిపోయారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో పోతున్నదెంత? అక్కడి నుంచి వస్తున్నదెంత? వంటి వివరాలు గవర్నర్‌ ప్రసంగంలో లేవు. గవర్నర్‌ ప్రసంగంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారా’ అనిప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కేబినెట్‌ మీటింగ్‌లో ఏం మాట్లాడామనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలకు చెబుతామని వ్యాఖ్యానించారు.

చార్మినార్, లాడ్‌బజార్‌ అభివృద్ధి ఊసేదీ?
అనంతరం అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి సహకారం లభించడంలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి కేంద్ర బడ్జెట్‌లో ఊసేలేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు, లాడ్‌బజార్‌ అభివృద్ధి, ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం, సచివాలయంలో మసీదు నిర్మాణం, పాతబస్తీలో మెట్రోరైలు ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు, రోడ్ల విస్తరణ వంటి అంశాల్లో ప్రభుత్వ తీరును విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement