సాక్షి, అమరావతి: ‘రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి నిమ్మగడ్డ మాట్లాడొచ్చు కానీ.. ఆయన గురించి తాము మాట్లాడకూడదా.. ఇదెక్కడి న్యాయం.. మంత్రులపై కొత్తగా ఆంక్షలు పెట్టారు.. ఎన్నికల కోడ్ మంత్రులు, ఎమ్మెల్యేలకేనా? నిమ్మగడ్డకు వర్తించదా..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. వీటిపై ఆయన సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి మీడియాతో మాట్లాడారు. 2009లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణిస్తే ఎన్నికల కమిషనర్‌కి 2021లో గుర్తొచ్చారా అని అడిగారు. సీబీఐ కేసులో తాను సాక్షిని, నిజం చెబుతాను అని అసందర్భంగా మాట్లాడడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల కమిషనర్‌గా ఉండి మంత్రి, సలహాదారుడు, ఐఏఎస్ అధికారిని తొలగించాలంటూ లేఖలు రాయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అంబటి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎజెండాలో భాగంగానే రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని.. బాబుకు లబ్ధి చేకూర్చడంలో భాగంగానే అధికారులను భయపెట్టడానికి ఎక్కడిక్కడ బాబు స్క్రిప్‌్టను చదువుతున్నారని అంబటి మండిపడ్డారు. గతంలో ఎంతోమంది ఎన్నికల అధికారులు, కమిషనర్లను చూశాంగానీ, ఇలాంటి సంకర జాతి (హైబ్రీడ్) కమిషనర్‌ను చూడలేదని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ పూర్తిగా మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆయన్ని ఎర్రగడ్డకు పంపాల్సిందేనన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకే ఆయన దిగజారి వ్యవహరించాలనుకోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్ట పరిణామంగా వైఎస్సార్‌సీపీ భావిస్తోందన్నారు.
జగన్‌పై కక్ష సాధింపునకే..
నిమ్మగడ్డ పర్యటన చూస్తుంటే సీఎం జగన్‌పై పగ తీర్చుకోవాలనే తాపత్రయం కనిపిస్తోందని అంబటి అన్నారు. ఇందులో భాగంగానే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఒంటిమిట్టలో నిద్రపోవాలనే కోరికను తీర్చుకోవడానికి పర్యటనలు చేస్తున్నారా అంటూ అంబటి నిమ్మగడ్డను ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వైఎస్సార్‌ను పొగుడుతున్నారని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ రాజ్యంగ శక్తికాదు.. చంద్రబాబు తొత్తు అని.. వైఎస్సార్‌ను పొగుడుతూనే ఆయన విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పని నిమ్మగడ్డ ప్రజాస్వామ్యవాది ఎలా అవుతారన్నారు. భవిష్యత్తులో దీనికి నిమ్మగడ్డ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
పవన్ సొంత కాళ్లపై నిలబడాలి
ఇక పవన్ కల్యాణ్ అంశాన్ని అంబటి ప్రస్తావిస్తూ.. కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లాలని ఆయన అంటున్నారని.. పవన్ ముందు టీడీపీని, బీజేపీని యాచించడం మానాలని హితవు పలికారు. పవన్ తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితికి వస్తే, అప్పుడు శాసించే స్థాయికి ఒక కులాన్ని తీసుకెళ్లవచ్చన్నారు. తిరుపతి సీటు ఇవ్వండి.. జీహెచ్‌ఎంసీ సీట్లలో మాకు కొన్ని ఇవ్వండి అని బీజేపీని యాచించారన్నారు. అలాగే, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని అంబటి ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేస్తున్న రోజుల్లో చిరంజీవి, దాసరి నారాయణరావు నాటి ప్రభుత్వాన్ని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఎక్కడున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment