
సాక్షి, అమరావతి: పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు 27 ఏళ్ల క్రితం వెన్నుపోటు పొడిచినప్పుడు తనపై పడిన రక్తపు మరకను తుడుచుకునేందుకే బావమరిది బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా చంద్రబాబు ప్రయత్నించారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. రాజకీయంగా పతనమైపోతున్న చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీని ఈ టాక్ షోలు కాపాడలేవని, వారి పతనం అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆహా అనే ఓటీటీ సంస్థ నిర్వహించే టాక్ షోలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బతిమలాడినా వినలేదని, అందుకే జుట్టు పట్టుకుని ఎన్టీఆర్‌ను కిందకు లాగేశాను అని చంద్రబాబు మాట్లాడితే.. అది ధర్మమే, న్యాయమేనంటూ బాలకృష్ణ తానా తందానా పలకడం పోగాలం కాకపోతే మరేమిటని నిలదీశారు. దీన్ని బట్టి.. చంద్రబాబు విలనే అని ప్రజలు మరో మారు నిర్ధారణకు వచ్చారని స్పష్టం చేశారు.
బాలకృష్ణ నిర్వహించే టాక్ షోకు ఇప్పటిదాకా సినీ ప్రముఖులు, హీరోలే వచ్చారని.. తొలిసారిగా రియల్ విలన్ చంద్రబాబు వచ్చారంటూ దెప్పి పొడిచారు. ఎన్టీఆర్, చంద్రబాబుల గురించి తెలిసిన నాదెండ్ల భాస్కర్‌రావు, లక్ష్మీపార్వతిలను ఆ టాక్ షోకు పిలిచి ఉంటే.. వాస్తవాలు తెలిసేవని, చంద్రబాబు బండారం బట్టబయలయ్యేదన్నారు. విదేశాల్లో విచ్చలవిడిగా అమ్మాయిలతో కులుకుతున్న కొన్ని ఫొటోలను బఫూన్, కామెడీ యాక్టర్ వంటి లోకేష్‌కు చూపుతూ.. వీటిపై ఏమంటావు అల్లుడూ అని బాలకృష్ణ ప్రశ్నిస్తే.. అది మామూలే, బ్రాహ్మణి కూడా వాటిని చూసిందని లోకేష్ అన్నారని చెప్పారు.
టాక్ షో ఆద్యంతం పరిశీలిస్తే.. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్‌లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బాలకృష్ణతో కూడబలుక్కుని ఈ డ్రామా ఆడారన్నది ప్రజలకు అర్థమైందన్నారు. పతనమైపోతున్న తన రాజకీయ జీవితానికి కాస్తయినా ఉపయోగపడుతుందనే పుత్రుడు లోకేష్‌తో కలిసి చంద్రబాబు ఈ షోలో పాల్గొన్నారన్నారు.
ఎన్టీఆర్ బతికుంటే చంద్రబాబుకు అధోగతే
టాక్ షో హిట్ అయినా.. నారా–నందమూరి కుటుంబాల పరువును వారే తీసుకున్నారని మంత్రి అంబటి దెప్పి పొడిచారు. రెక్కల కష్టంతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, టీడీపీని.. చంద్రబాబు చేజిక్కించుకోవడం, ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం తప్పే కాదని చంద్రబాబు, బాలకృష్ణ తానా తందానా అంటూ మాట్లాడటం హేయమన్నారు.
నాన్నకు వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఘన విజయం సాధించామని.. అందుకే అది కరెక్ట్ అని తేలిపోయిందంటూ బాలకృష్ణ చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 1995లో ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించేసి చంద్రబాబు పాలన చేపట్టిన నాలుగు నెలలకే ఎన్టీఆర్ చనిపోయారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ చనిపోకపోయి ఉంటే చంద్రబాబు గతి ఏమయ్యేదని బాలకృష్ణను ప్రశ్నించారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు అప్పట్లోనే అధోగతిపాలయ్యే వారని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు మాటలను అద్భుతం.. మహాద్భుతం అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అచ్చేయడం విచిత్రంగా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ 175 స్థానాల్లో ఘన విజయం సాధించడం అన్ స్టాపబుల్ అని రాసుకోండి అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, బాలకృష్ణలకు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బావురుమని ఏడుస్తూ అసెంబ్లీ నుంచి వెళ్లి బామ్మర్ది దగ్గర షోలు చేసుకునే స్థితికి దిగజారిపోయాడని, రాష్ట్రంలో ఇంకా టీడీపీ ఎక్కడుందని ప్రశ్నించారు.
పాకెట్ మనీ తీసుకున్నది మరిచావా బాబూ?
‘టాక్ షోలో మీకు మంచి మిత్రుడు ఎవరని ప్రశ్నిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి అని బాబు చెప్పారు. ఆ రోజుల్లో వైఎస్ బాగా ధనవంతుడు. చంద్రబాబుది చిన్న కుటుంబం. వారి స్నేహంలో వైఎస్ వద్ద ఖర్చుల కోసం ఐదు, పది వేలు చంద్రబాబు తీసుకునే వాడు.
ఇందులో తప్పేమీ లేదు. అయితే ఆ విషయాన్ని కూడా చంద్రబాబు చెప్పాలి కదా?’ అని అంబటి ప్రశ్నించారు. మహా పాదయాత్ర పేరుతో వెళుతున్న ఫాల్స్ పాదయాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యం అవుతున్నారని.. పిడికిలి బిగించి ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేశారు.
తొడలు కొట్టే వారిని, మీసాలు తిప్పే వారిని తిప్పికొడతారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రపై దాడి చేస్తున్నందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment