బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పిన ‘దత్తపుత్రుడు’ | Analysis On Tdp And Janasena Announce First Joint List | Sakshi
Sakshi News home page

బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పిన ‘దత్తపుత్రుడు’

Published Sat, Feb 24 2024 8:32 PM | Last Updated on Sat, Feb 24 2024 8:56 PM

Analysis On Tdp And Janasena Announce First Joint List - Sakshi

ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. తాము ఏం చేసినా క్యాడర్‌లో సమరోత్సాహం నిండేలా ప్లాన్‌ చేసుకుంటుంది. కానీ.. టీడీపీ, జనసేన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, విమర్శలు చేసినా, హామీలిచ్చినా.. క్యాడర్‌లో నిసత్తువ పెరుగుతూనే ఉంది. ఓటమి భయం ఎక్కువ అవుతూనే ఉంది. చివరకు అభ్యర్థుల జాబిత ప్రకటన కూడా.. ఇక మన పని అయిపోయిందన్న క్లారిటీకి క్యాడర్‌కి వచ్చేసింది.

కాళ్లా, వేళ్లా పడ్డా కమలం కరుణించేటట్టు కనిపించడం లేదు. దీంతో...175 స్థానాల్లో పోటీకి అభ్యర్థులే లేని టీడీపీ, బాబు చెప్పిన పేర్లని  ప్రకటించే జనసేన కలిసి...అభ్యర్థులను ప్రకటించి మమ..అనిపించేశారు. టీడీపీతో పొత్తుకి బీజేపీని ఒప్పించడానికి నానా చివాట్లు తిన్నానని గర్వంగా చెప్పుకున్న దత్తపుత్రుడు...పేపర్‌ మీద తమ పార్టీ అభ్యర్థుల పేర్లు రాసుకొచ్చి.. బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పేశారు. 

స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలైనప్పుడు.. ఆయనను పరామర్శించిన పవన్‌ కళ్యాణ్‌.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు బయటే తన ముసుగు తీసేశారు. తాను చంద్రబాబు దత్తపుత్రుడ్నే అని తేల్చి చెప్పేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి వెళుతున్నట్టు ప్రకటించేశారు. దీంతో.. టీడీపీకి బలమంతా మనమే అని...ఈ సారి కనీసం 80 స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్టు జనసేన అభిమానులు నాడు తెగ సంబరపడిపోయారు. సీన్‌ కట్‌ చేస్తే.. టీడీపీ, జనసేన కలిసి అభ్యర్థులను ప్రకటించేశారు. దత్తపుత్రుడికి చంద్రబాబు ఇచ్చింది 80 కాదు. 60 కాదు. 40 కాదు. జస్ట్‌ 24 స్థానాలు మాత్రమే. దీంతో.. జనసేన పార్టీ స్థాపన వెనుకే చంద్రబాబు ఉన్నారని, టీడీపీ పల్లకి మోయడమే లక్ష్యంగా జనసేన ఏర్పడిందని ఇప్పటి దాకా వినిపిస్తున్నవీ పచ్చి నిజాలే అని తేలిపోయింది. బానిసిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారిన పవన్‌ కళ్యాణ్‌ని చూసి జనసేన అభిమానులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.

ఇదిగో ఈ ఒక్క విషయం పరిశీలించండి. చంద్రబాబు, పవన్‌ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. బాబు చేతిలో ప్రింట్‌ చేసిన అభ్యర్థుల లిస్ట్‌. మరి పవన్‌ చేతిలో ? హ్యాండ్‌ బుక్‌లో పెన్నుతో ఐదుగురు అభ్యర్థుల పేర్లు రాసి ఉన్నాయి కదా. రాజకీయంగా పవన్‌ దుస్థితికి, బానిసిజానికి ఇంత కన్నా ఉదాహరణ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను పవన్‌ ముందే డిసైడ్‌ చేసి ఉంటే.. ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ప్రింటెడ్‌ కాపీతో వచ్చేవారని...అలా కాకుండా పెన్నుతో అభ్యర్థుల పేర్లు రాసి ఉన్నాయంటే.. అప్పటికప్పుడు రాసినవని అర్థమైపోతుందని పరిశీలకులు చెబుతున్నారు.

జనసేన అభ్యర్థులెవరో బాబు డిక్టేట్‌ చేస్తే, పవన్‌ అప్పటికప్పుడు రాసేసుకున్నారని పొలిటికల్‌ ఎనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. దేశ రాజకీయాల్లో తన పార్టీని తానే ఇంత ఘోరంగా అవమానించుకున్న ఏకైక అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అంటున్నాయి రాజకీయ వర్గాలు. సరే...అప్పటికప్పుడే అభ్యర్థులని డిసైడ్‌ చేశారు అనుకుందాం. 24 సీట్లు జనసేనకి కేటాయించినా, పట్టుమని పది మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ప్రకటించడానికి అసలు అభ్యర్థులు ఉంటే కదా.

ఆ ఐదుగురు అభ్యర్థుల పేర్లని అయినా టైప్‌ చేసి ప్రింట్‌ తీసుకుని మీడియా ముందుకొస్తే హుందాగా అయినా ఉండేది కదా. అంటే... టీడీపీ పల్లకి మోయడం తప్ప మరేం ఆలోచించలేని దుస్థితిలో ఉన్న పవన్‌కి ఇన్నాళ్లు జై కొట్టామా అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కి బాబు ఇచ్చిందే 24 స్థానాలు. అందులో మళ్లీ 19 స్థానాల్లో సస్పెన్స్‌ ఎపిసోడ్‌. పట్టుమని పాతిక స్థానాల్లో ప్రకటించడానికి అభ్యర్థులు కూడా లేని పవన్‌...ఇన్నాళ్లు అరుస్తూ, ఊగిపోతూ, తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చిందులేస్తూ, చేసిన హడావుడి అంతా గుర్తుచేసుకుని ప్రజలు నవ్వుకుంటున్నారు.

మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు సంగతేంటన్న ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్‌ చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. తనకు తెలిసిన నక్కజిత్తులన్నీ ప్రదర్శించారు. కానీ.. ఫలితం లేకపోయింది. 25 సార్లు బీజేపీ జాతీయ నాయకుల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించి విఫలమైయ్యారు. ఒకవైపు దత్తపుత్రుడు, మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇలా అనేక కోణాల నుంచి ప్రయత్నిస్తే.. కాళ్ల బేరానికి అవకాశం దొరికింది. దీంతో.. శరణు శరణు.. పాహిమాం.. పాహిమాం అంటూ హస్తినలో కాళ్ల బేరం ఎపిసోడ్‌ని ఒక రేంజ్‌లో చంద్రబాబు పండించారు.

నాటి నుంచి బీజేపీ వైపు నుంచి పొత్తుల మీద ఎలాంటి ప్రకటన రాలేదు. చిన్న ఫీలర్‌ కూడా లీక్‌ చేయలేదు. బాబు, పవన్‌ మాత్రం పొత్తు ఖాయమని బిల్డప్‌ ఇచ్చి.. హఠాత్తుగా ఇద్దరూ కలిసి అభ్యర్థులను ప్రకటించేశారు. బీజేపీ పొత్తుకి సిద్ధంగా లేదన్న స్పష్టత వచ్చిన తర్వాతే...బాబు, పవన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు.. కేవలం దత్తపుత్రుడితో కలిసే చంద్రబాబు ఎన్నికలకు వెళితే.. బీజేపీ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందన్న కోణం తన పరిధిని పెంచుకుంటోంది. అదే సమయంలో బీజేపీ వైపు వేలు చూపిస్తూ మైనార్టీలను దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ మైనార్టీలను మోసం చేయడానికి చంద్రబాబు సరికొత్త స్కెచ్‌ గీస్తున్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో డిస్కషన్‌ నడుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement