రాజకీయ నాయకుడు ఎవరైనా ఏదైనా అంశం మీద మాట్లాడేటపుడు పూర్తి సమాచారం తెలుసుకోవాలి. విషయం తెలియకుండా నోటికొచ్చింది చెబుతానంటే కుదరదు. మన నారా లోకేశం కదా.. టాపిక్ ఏదైనా.. ఏమీ తెలియకపోయినా..చెప్పేయవచ్చు. పాదయాత్రలో లోకేష్ నోటి నుంచి వెలువడుతున్న ఆణిముత్యాలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంతకీ నారా వారి లోకేష్ ఏమన్నాడో చూద్దాం!
పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్ అభాసుపాలు అవుతున్నారు. బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే కాదు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ప్రతి టీడీపీ కార్యకర్త మీద కనీసం ఇరవై పోలీసు కేసులు ఉండాలని.. అప్పుడే బాగా పనిచేస్తున్నట్లు గుర్తిస్తానని నారా లోకేష్ వ్యాఖ్యానించటం విమర్శలకు దారితీస్తోంది.
రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేయండి.. నేను వెనకేసుకు వస్తా అన్నట్లుగా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్.. ముఠా కక్షల ప్రభావం ఇప్పటికీ ఉంది. లోకేష్ మాటలు నమ్మి ఎవరైనా హింసా రాజకీయాలకు పాల్పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? రాజకీయ లబ్ధి కోసం కార్యకర్తలను రెచ్చగొట్టి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతావా..? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ వైఖరిని అందరూ ఖండిస్తున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు ఖాతాలో వేసే ప్రయత్నం చేయడాన్ని జనం తప్పుపడుతున్నారు. సీఎం జగన్ కృషితో అనంతపురం నగరానికి 300 కోట్లతో అర్బన్ లింక్ ప్రాజెక్టు 2020లో మంజూరైంది. ఆ హైవే పనులు అనంతపురంలో ముమ్మరంగా జరుగుతున్న తీరును గమనించిన నారా లోకేష్... ఈ జాతీయ రహదారి మేమే తెచ్చామంటూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.
ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.. పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా హైవే ఎలా వచ్చిందో ఆధారాలు బయట పెట్టారు. గొప్ప నాయకుడిగా ఫీలవుతున్న నారా లోకేష్ ఆఖరుకు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేశారని.. మరో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఎస్కే యూనివర్సిటీలో చదివారని నారా లోకేష్ బహిరంగ సభలో చెప్పారు. అయితే ఈ ఇద్దరు ప్రముఖులకు ఎస్కే యూనివర్సిటీతో సంబంధమే లేదు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ఎస్కే యూనివర్శిటీని 1981 సంవత్సరంలో స్థాపించారు.
లోకేష్ చేస్తున్న అజ్ఞానపు ప్రకటనలు చూసి అనంతపురం ప్రజలు నవ్వుకుంటున్నారు. మిడి మిడి జ్ఞానంతో నారా లోకేష్ చేస్తున్న ప్రసంగాల్లో పస లేదనే విషయం జనానికి అర్థం అయిపోయింది. అందుకే ఆయన పాదయాత్రను చూసేందుకు కూడా ప్రజలు ఇష్టపడటం లేదు. లోకేష్ అనుచిత వ్యాఖ్యలు, అజ్ఞానపు ప్రకటనలపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment