16న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రకటన | AP CM YS Jagan Likely To Announce YSRCP Complete Candidates List On March 16th, Details Inside - Sakshi
Sakshi News home page

YSRCP Candidates Announcement: 16న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రకటన

Published Thu, Mar 14 2024 4:37 AM | Last Updated on Thu, Mar 14 2024 10:07 AM

Announcement of YSRCP candidates on 16th - Sakshi

 ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను ప్రకటించనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. జనబలమే గీటురాయిగా,  సామాజిక న్యాయమే పరమావధిగా ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు.

ఒకవైపు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు,  అభ్యర్థుల ఎంపికపై అసమ్మతి సెగలు పొగలు కక్కుతుండగా రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకేందుకు వైఎస్సార్‌ సీపీ సన్నద్ధమైంది. ఈమేరకు ఈనెల 16వతేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్‌ ప్రకటించే అవకాశం ఉంది.

అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు. 



ఉరిమే ఉత్సాహంతో..
ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా వైఎస్సార్‌ సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఆ సభలకు జనం పోటెత్తడం, ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో ఉరిమే ఉత్సాహంతో కదనరంగంలోకి దూసుకెళ్లడానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ అమలు చేయగలిగే హామీలతో మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అది తుది దశకు చేరుకుంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచార భేరి మోగించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించేలోగా ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. 

చేసిన మంచిని వివరిస్తూ.. మోసాలను ఎండగడుతూ
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ప్రజల్లోనే ఉన్నారు. జనంతో మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా 87 శాతం కుటుంబాల ఖాతాల్లో  డీబీటీ రూపంలోనే రూ.2.65 లక్షల కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా జమ చేశారు.

పరిపాలన వికేంద్రీకరణ, సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు. వీటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రచారపర్వంలో వివరించనున్నారు. ఇదే అంశాలను ఇంటింటా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తెలియచేయనున్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో  650 హామీలతో  మేనిఫెస్టోను ప్రకటించి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధి­కారంలోకి వచ్చాక టీడీపీ–బీజేపీ–జనసేన ప్రభుత్వం పది శాతం హామీలను కూడా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల బరిలోకి దిగి హామీలు గుప్పిస్తూ మరోసారి మోసం చేసేందుకు వస్తోందనే అంశాన్ని సీఎం జగన్‌ ప్రజలకు వివరించనున్నారు. ఇంటింటా ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇవే అంశాలను తెలియచేస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement