తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనలాగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినవాళ్లు ప్రస్తుతానికి లేరు. అలాగే ఆయన పేరుకు ఒక పర్యాయపదం కూడా ఉంది. అదే ‘వెన్నుపోటు’! రాజకీయంగా ఓడిపోయి దిక్కులేకుండా పడి ఉన్న సమయంలో చేరదీసి పార్టీ కీలక బాధ్యతలు కూడా అప్పగించిన సొంత మామయ్యను వెన్నుపోటు పొడిచి పార్టీని, అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు.. తన వెన్నుపోటు బుద్ధులను ఎలా మార్చుకుంటారు? ఎందుకు మార్చుకుంటారు?..
అందుకే.. పొత్తులు కుదిరిన తర్వాత కూడా బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీచేయబోయే కొందరు అభ్యర్థుల్ని ఓడించడానికి చంద్రబాబు ఇప్పటినుంచే స్కెచ్ సిద్ధం చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా చంద్రబాబు.. మిత్రపక్షాలు ఇద్దరికీ కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీస్థానాలు మాత్రమే కేటాయించారు. వారిలో వారు కొట్టుకునేలా, బీజేపీ అంటే మితిమీరిన భయం ఉన్న పవన్ కల్యాణ్ తనకు విదిలించిన 24 సీట్లలో కూడా కొన్ని కోల్పోయేలాగా ఆయన తన స్కెచ్ ను పదును పెట్టారు.
అయితే తాజాగా వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే.. బీజేపీ తరఫున, జనసేన తరఫున కూడా పోటీచేయబోతున్న కొందరు కీలక నాయకుల్ని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని!. చంద్రబాబుతో పొత్తుబంధాన్ని వ్యతిరేకించిన వారు, ఆయన వెన్నుపోటు దారుడని, ఆయన్ని నమ్ముకుని రాజకీయం చేస్తే తమను నట్టేట ముంచేస్తాడని బహిరంగంగానే తమ అనుమానాలను వ్యక్తంచేసిన వారు ఈ రెండు పార్టీల్లో కూడా ఉన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో నెగ్గరాదని.. వారికి ఓటమి రుచిచూపించి వారి రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.
ఈ వ్యూహానికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అద్యక్షుడు సోము వీర్రాజు విషయమే తీసుకుందాం. ఆయన పార్టీ సారథిగా ఉన్నన్నాళ్లూ చంద్రబాబునాయుడుకు చుక్కలు చూపించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల గురించి ఒక రేంజిలో ఆడుకున్నారు. చంద్రబాబు అక్రమాల మీద విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు. పొత్తుల గురించిన చర్చలు మొదలైన తర్వాత కూడా.. సోము వీర్రాజు ప్రతికూలంగా మాట్లాడారు. రాష్ట్రంలో పొత్తులు ఉండవని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు తాము ఒంటరిగా పోటీచేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు పొత్తులు కుదిరిన తర్వాత ఆయన రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలో దిగవచ్చునని వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోము వీర్రాజు ఎంపీగా నెగ్గకుండా.. ఇప్పటికే చంద్రబాబు తమ పార్టీ వారిని పురమాయించినట్లుగా తెలుస్తోంది. పగబట్టిన తాచుపాములాగా.. తనను తిట్టిన సోము వీర్రాజుకు తన తడాఖా చూపించాలని ఆయన అనుకుంటున్నారట. జనసేనలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యేల విషయంలోనైనా రాజీపడతారేమో గానీ.. ఎంపీల జాబితాలో మాత్రం.. తనకు గిట్టని వారిని ఓడించడానికి చంద్రబాబు లిస్టు సిద్ధంచేసినట్టు సమాచారం.
చంద్రబాబునాయుడు అసలు వైఖరి తెలిసిన వాళ్లు మాత్రం.. ఒకవేళ రాష్ట్ర బీజేపీ సారథి దగ్గుబాటి పురందేశ్వరి నిలబడినా కూడా.. ఆమెను ఓడించడానికి తెరవెనుక కుట్రలు చేస్తారని, మంత్రి పదవుల వద్ద చికాకు పెడతాడనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఓటమికి ఆయన కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
:::వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment