అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి? | AP Ministers and MLCs Fires On TDP Leader Ayyanna Arrest | Sakshi
Sakshi News home page

అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?

Published Fri, Nov 4 2022 4:11 AM | Last Updated on Fri, Nov 4 2022 4:11 AM

AP Ministers and MLCs Fires On TDP Leader Ayyanna Arrest - Sakshi

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు.

ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే..

అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న
‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు.

పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్‌ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్‌వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు.

చట్టం ముందు ఎవరైనా ఒక్కటే
తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్‌ కళ్యాణ్‌ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి.
– కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే

తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్‌ ఇచ్చిందా?
అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్‌ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం.

ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్‌ సోషల్‌ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. 
– తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు

తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం
అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి.
– మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు
రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్‌ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్‌ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. 
– ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

ఫోర్జరీ చేయడం నేరం కాదా?
ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్‌ స్థలాన్ని  ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు.

కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆలోచించే టైమ్‌ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. 
– మంత్రి జోగి రమేష్‌

అయ్యన్న పెద్ద కబ్జా కోరు 
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్‌ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు.

ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను  హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే.   
– మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement