![AP People Satirical Comments Over Janasena And Pawan Kalyan - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/13/Pawan.jpg.webp?itok=a5SO3cJv)
తనకేదో వీరబీభత్సమైన ప్రజాదరణ ఉన్నదని ముందుగా ప్రచారం చేసుకోవాలి. ఓట్లు పడినా పడకపోయినా పర్లేదు.. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే.. ఎమోషన్స్ రకరకాలుగా పండించినంత ప్రొఫెషనల్‌గా, వేదిక ఎక్కితే ఆవేశపూరిత ప్రసంగాలతో విజిల్స్ కొట్టించుకోవాలి. చాలు.. అక్కడితో మాబలం అపూర్వం అని చాటుకుని.. సీట్ల విషయంలో పెద్ద బేరాలు పెట్టవచ్చు. పెద్ద నెంబరు దగ్గర ప్రారంభించి.. వీలైనన్ని దక్కించుకోవచ్చు. సీట్లు దక్కిన తర్వాత పరిస్థితి ఏమిటి.. వాటిని బహిరంగమార్కెట్లో వేలానికి పెట్టవచ్చు. ..అచ్చంగా ఇది పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు!
జనసేన పార్టీని స్థాపించి పదేళ్లకు పైగానే అయింది గానీ.. పార్టీ సంస్థాగత నిర్మాణం అనే పదానికి అర్థం కూడా తెలియని నాయకుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పొత్తుల్లో ఉంటూ, ఈసారి వారు విదిల్చిన సీట్లలో పోటీకి దిగుతున్నారు. ఇంతకూ ఆయనకు అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులు ఉన్నారా? అంటే ఆ పార్టీలో ఎవ్వరివద్దా సమాధానం ఉండదు. ప్రతీచోటా టికెట్ ఆశించే అనాకానీ నేతలు బోలెడుమంది ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ ఆశించే ‘బలం’ చూపించగలిగిన వాళ్లు ఎందరుంటారు? అందుకే 24 అనుకుని 21 తగ్గిన తర్వాత 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కల్యాణ్.. మిగిలిన 15 సీట్లను బేరానికి పెడుతున్నారు.
పవన్ కల్యాణ్ తాను ఎంత గొప్ప నాయకుడిని అని చెప్పుకున్నా.. తన పార్టీ ఎంత గొప్పదని చెప్పుకున్నా.. సభలు గట్రా నిర్వహించేప్పుడు ఆయనతో పాటు వేదికమీద కూర్చోడానికి నాదెండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడికి గతి లేదు. అలాగే 24, 21 కాదు కదా.. ఆయన పార్టీకి చంద్రబాబు 50 సీట్లు కేటాయించినా ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరు అనే భావన ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. తొలిజాబితా అనే పేరుతో ఐదుగురి పేర్లను, తర్వాత మరొక పేరును పవన్ విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూస్తూ గడుపుతున్నారు.
ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొణతల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి కట్టబెట్టేస్తున్నారు. చూడబోతే ఒకటీ అరా తప్ప జనసేన వాటాకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే.. ఉన్న పార్టీని వదలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా ఉంది.
అన్ని సీట్లను కొత్తవారికే ఇస్తోంటే ప్రధానంగా రెండు అనుమానాలు కలుగుతాయి. ఒకటి- జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యే స్థాయికి పోటీచేయగల నాయకుల కొరత చాలా ఉంది. రెండు- పంపకాల్లో సీట్లను తేల్చుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో రెండో ఆప్షన్ ఎక్కువ సందర్భాల్లో నిజమని ప్రజలు నమ్ముతున్నారు.
పార్టీ దుస్థితి అనాలో లేదా, పవన్ కల్యాణ్‌లోని వ్యాపార మెళకువ అనాలో తెలియదు. మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే. తెలంగాణలో బీజేపీతో చాలా దూరం సాగదీసి 119లో ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్‌కు ఆయా స్థానాల్లో పోటీచేయించేందుకు కూడా అభ్యర్థులు లేరు. సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి ఆ సీట్లను అమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కినది 21 కాగా.. ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించేయగా, మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టారు.
నిజానికి పవన్ కల్యాణ్ ఒక స్థానంలో పోటీచేస్తారు కదా అనుకోవచ్చు. అదేం లేదు.. మంచి బేరం తగిలితే.. మొత్తం 15 టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ప్రజలు అనుకుంటున్నారు. ఎటూ దక్కిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరి బేరానికి ఇచ్చేసిన పవన్ కాకినాడలో తానే ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం ఉంది. ఎటూ ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు.. ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చునని ఆయన ఆశపడుతున్నారు. అందువల్ల.. మంచి బేరం దొరికితే.. తనకోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని అనుకుంటున్నారు.
-వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment