ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మరో మూడు నెలలు కూడా ల్లేవ్. అధికార పక్షం ఈపాటికే వ్యూహాత్మకంగా మార్పులు చేర్పులు చేసుకుంటోంది. మరోవైపు పొత్తు సీట్ల సర్దుబాటు కోసం టీడీపీ-జనసేనలు నానా తంటాలు పడుతున్నాయి. షర్మిలను రంగంలోకి దించి కాంగ్రెస్ తమదైన కుట్ర రాజకీయాలకు దిగింది. బీజేపీ సంగతి సరేసరి. అయితే ఇంత హడావిడిలోనూ చంద్రబాబు నాయుడి తనయుడు.. తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పర్యటనల్లేవ్.. ఎక్కడా హడావిడి లేదు. చంద్రబాబు సభల్ని కూడా వాయిదా వేశారు. పలు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీలో అసలేం జరుగుతోంది? ఇంతకీ నారా లోకేష్ ఎక్కడ?. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్లకు దిగులు పట్టుకుంది. వివిధ కేసుల విచారణ కోర్టుల్లో వాయిదానే పడ్డాయి కదా!. ఎలాగూ అరెస్టు భయం కూడా ఉండదు కదా. మరి లోకేషన్న ఎక్కడ? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు? అంటూ టీడీపీ కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే..
అమెరికాలో ఉన్నాడా?
లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో.. అసలు దేశంలోనే లేరని.. ఆయన అమెరికా వెళ్లి ఓ వ్యవహారంలో చిక్కుకున్నట్లు కొందరు పోస్టులు చేస్తున్నారు. రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులను సమకూర్చుకునే నిమిత్తం నగదు లావాదేవీలు చేపట్టేందుకు లోకేష్ అమెరికా వెళ్లారని.. అక్కడే ఆయన ఊహించని సమస్యలో చిక్కుకునిపోయారని కొందరు పోస్టులు చేస్తున్నారు.
టీడీపీ స్పందించదేం!
నారా లోకేష్ కెమెరాకు చివరిసారి కనిపించింది పవన్‌తో బాబు ఇంట్లో డిన్నర్‌లో.. ఆపై నారావారి సంక్రాంతి సంబురాల్లో. ఆ తర్వాత పదిరోజుల నుంచి ఆయన ముఖం మీడియాలో(టీడీపీ అనుకూల మీడియాల్లో సైతం) కనిపించలేదు. జనవరి 23వ తేదీ పుట్టినరోజు కూడా ఆయన లేకుండానే వేడుకలు నిర్వహించాయి టీడీపీ శ్రేణులు. దీంతో ఈ కథనాలపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. లోకేష్ ఎక్కడా అంటూ మంగళగిరి కార్యాలయానికి ఫోన్లు పోటెత్తుతున్నాయి.
అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆరా తీస్తున్నాయి. ఇప్పటిదాకా అయితే టీడీపీ నుంచి గానీ, దాని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి గానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ ఉదయం కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్లు పోస్టు చేస్తుండగా.. అక్కడా కొందరు ‘ఎక్కడ ఉన్నారంటూ?’ రిప్లైలో ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా.. సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న కథనాల నేపథ్యంలో అయినా ఆయన అజ్ఞాతం వీడి బయటకు రావాలని.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయమూ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment