
తూర్పుగోదావరి/పశ్చిమ గోదావరి: ముందు నుంచి ఊహించిందే జరిగింది. టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల ఆ పార్టీల ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అధిష్టానానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..
రాజానగరంలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. అలాగే.. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటిదాకా ఇరు వర్గాలకు క్లారిటీ లేకుండా చేశారు. దీంతో.. టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక.. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. మరోవైపు.. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించిన పవన్.. ఇప్పుడు చంద్రబాబుకి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశాడని కేడర్ మండిపడుతోంది.
ఇక.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాల్ని సైతం టీడీపీనే లాగేసుకుంది. ఈ క్రమంలో.. మాజీ మంత్రి పీతల సుజాతకు మొండి చేయి చూపించారు చంద్రబాబు. ఇక.. చింతలపూడి లో నాన్ లోకల్‌కి టికెట్ కేటాయించడంతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అలాగే.. తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాల్లో టిడిపి జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో పంచాయితీ తేలలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేననేత రెడ్డప్పల నాయుడుకి భంగపాటే ఎదురైంది. ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. పాపం.. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది.
Comments
Please login to add a commentAdd a comment