
కృష్ణా, సాక్షి: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్‌కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్‌కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్‌కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్‌కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే..
‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్‌కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు.
పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్‌ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment