Avanigadda Assembly constituency
-
‘పవర్’లేని పవన్ పాలిటిక్స్.. ఇదేనా జనసేన నీతి?
కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనసైనికులకు షాకిస్తూ పవన్ కల్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠకు పవన్ తెరదించారు. అంతా అనుకున్నట్టుగానే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధినేత పవన్ ఖరారు చేశారు. ఇక, మొదటి నుంచి అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటూ స్థానిక నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, మొదట మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కలేదు. అయితే, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. దీంతో, కూటమి పొత్తులో భాగంగా ఆయనకే సీటు వచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేసి టికెట్ ఇప్పించారు. ఈ విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు ఉంటే తెరమీద పవన్ నటించారు. మరోవైపు.. మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరిన నాటి నుంచి జనసేన టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే పవన్ ఖరారు చేశారు. ఇక, గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. మిగిలిన పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థి పేర్లపై పవన్ రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మిత్ర పక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
Pawan Kalyan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
కృష్ణా, సాక్షి: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్‌కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి. విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్‌కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్‌కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్‌కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్‌కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్‌ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
అవనిగడ్డ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి కీలక ప్రకటన
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్నారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు. అయితే.. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారాయన. సోమవారం సాయంత్రం సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరణ్‌కు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇకనుంచి రామ్‌చరణ్ అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ ఇంచార్జిగా ప్రతి గడపకూ తిరుగుతాడు. సీఎం జగన్ పేదలకు అందించిన నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాడు.. .. మాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌గారికి మరోకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అవనిగడ్డ ప్రజలకు మూడు తరాలుగా మా తండ్రి సింహాద్రి సత్యనారాయణ సేవలు అందించారు. ఆ వారసత్వాన్ని నా కుమారుడు రామ్‌చరణ్ నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి సిద్దంగా ఉన్నాడు. మీరంతా గతంలోలా మా కుటంబాన్ని ఆదరించి నా కుమారుడిని ఆశీర్వదించాలని విన్నవించుకుంటున్నా అని పార్టీ కేడర్‌ను, అలాగే ప్రజలను కోరారాయన.