
కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనసైనికులకు షాకిస్తూ పవన్ కల్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠకు పవన్ తెరదించారు. అంతా అనుకున్నట్టుగానే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధినేత పవన్ ఖరారు చేశారు.
ఇక, మొదటి నుంచి అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటూ స్థానిక నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, మొదట మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కలేదు. అయితే, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. దీంతో, కూటమి పొత్తులో భాగంగా ఆయనకే సీటు వచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేసి టికెట్ ఇప్పించారు. ఈ విషయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు ఉంటే తెరమీద పవన్ నటించారు.
మరోవైపు.. మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరిన నాటి నుంచి జనసేన టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే పవన్ ఖరారు చేశారు. ఇక, గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా.. మిగిలిన పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థి పేర్లపై పవన్ రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మిత్ర పక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.