ఏపీ రాజకీయాలపై చంద్రబాబు బిగ్ స్కెచ్
ప్రశ్నార్థకంగా పవన్ పొలిటికల్ కెరీర్
బీజేపీ, టీడీపీ ప్లాన్‌లో పావుగా పవన్
పవన్ కారణంగా పార్టీకి దూరంగా నాగబాబు
ఆందోళనలో జనసైనికులు
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? అంటే.. అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ గేమ్‌లో పవన్ సమిధలా మారినట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ముందు నుంచీ కాకినాడ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాలని భావించాడు. కాగా, కూటమి ఏర్పాటులో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ పెద్దలు పవన్‌ను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో, పవన్ గందరగోళంలో పడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆందోళనలో కేడర్
ఇక, కాకినాడ పార్లమెంట్ స్థానంలో జనసేన పరిస్థితి బాగోలేదని, గెలిచే పరిస్థితి లేదని గతంలోనే పవన్‌కు పార్టీ కేడర్ స్పష్టతనిచ్చింది. ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. కాకినాడలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు వారు పవన్‌కు సూచించారు. అయితే, తాజాగా ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పవన్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసైనికులు మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తప్పదని జనసేనాని, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.
మరోవైపు, కూటమిలో తొలి జాబితా విడుదల సందర్భంగా పవన్ ఎక్కడ పోటీ చేస్తారనేది చెప్పకపోవడంతో జనసైనికులు అధినేతపై ఆగ్రహంగా ఉన్నారు. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లినా పవన్‌ను సీఎం.. సీఎం అని భావించి కేడర్ నినాదాలు చేసింది. ఇప్పుడు సీఎం కాదు కదా.. ఎమ్మెల్యేగా కూడా ఉండే పరిస్థితిలేదని వారంతా బాధపడుతున్నారు. నైతిక విలువల్లో దిగజారిపోతే ఇలానే ఉంటుందంటూ జనసేన నాయకుల అసహనంగా ఉన్నారు.
ప్రమాదంలో నాగబాబు పొలిటికల్ కేరీర్..
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగాబాబు పొలిటికల్ కేరీర్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇన్నాళ్లు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని భావించిన నాగబాబు తాజాగా అక్కడి నుంచి జెండా ఎత్తేశారు. ఉన్నట్టుండి అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. నాగాబాబు అనకాపల్లిలో పోటీ చేసే ఛాన్స్‌లేదని జనసైనికులు తెగేసి చెబుతున్నారు. సర్వేలు కూడా నాగబాబుకు వ్యతిరేకంగా రావడంతో ఆయన అనకాపల్లిని వదులుకున్నట్టు సమాచారం. దీంతో, పార్టీ వ్యవహారాలకు నాగాబాబు దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది.
చంద్రబాబు మైండ్ గేమ్..
చంద్రబాబు పొలిటికల్ ప్లాన్‌లో భాగంగానే ఇలా జరిగినట్టు పలువురు చెబుతున్నారు. పవన్‌ను రాష్ట్ర రాజకీయాల్లో ఉంచకూడదనే ప్లాన్‌లో భాగంగా ఎంపీగా పంపాలని చంద్రబాబు డిసైడయ్యారు. ఈ స్కెచ్‌లో భాగంగా తన మాటను బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు.. బీజేపీ పెద్దలకు చేరేలా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, ఎన్నో విధాలుగా తనకు లాభం జరుగుతుందని చంద్రబాబు ఆలోచన చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment