వైఎస్‌ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేన క్యాడర్ సహకరించడంలేదా? జనసేన సహాయ నిరాకరణ చేయడం నిజమే అంటున్నారు టీడీపీ నేతలు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. మరి ఎన్నికల తర్వాత తమకు గ్యారెంటీ ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. ఎన్నికల్లో ఓటమి ఎలాగూ ఖాయమైంది. ఓడిపోయే టీడీపీ అభ్యర్థుల కోసం తామెందుకు కష్టపడాలంటూ జనసైనికులు దూరంగా ఉంటున్నారు. కడప జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతోంది..?
సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాలమే కాదు.. పరిస్థితులు కూడా కలిసిరావడంలేదంట జోక్స్ పేలుతున్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి నానా కష్టాలు పడి తన భార్య మాధవికి కడప అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. తొలిజాబితాలో కడప అభ్యర్థిని ప్రకటించగానే.. శ్రీనివాసులురెడ్డి, ఆయన సతీమణి మాధవీరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తికాకముందు రెండు పార్టీల నేతలు కలిసి మెలిసి తిరిగారు. తొలిజాబితా ప్రకటించగానే అటు టీడీపీలోనూ.. ఇటు జనసేన నుంచి నిరసన స్వరం వినిపిస్తోంది. కడప అసెంబ్లీ సీటు మాధవీరెడ్డికి కేటాయించడం ఇష్టం లేని టీడీపీ నేతలు, టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
అభ్యర్థులను ప్రకటించకముందు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సీటు తమదే అంటూ ప్రచారం చేసుకున్నవారి వెంట జనసేన కేడర్ తిరిగేవారు. అయితే, అభ్యర్థి ప్రకటన తర్వాత హఠాత్తుగా జనసేన దూరం జరిగింది. దీంతో, ఓ వైపు సొంత పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ, మరోవైపు పొత్తు పెట్టుకున్న పార్టీ నుంచి కూడా సహకారం అందకపోవడంతో.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, మాధవీరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోడంలేదు. వైఎస్సార్‌సీపీతో సమరానికి తాము సైతం అంటూ ముందుకు వచ్చిన జనసైనికులు ఒక్కసారిగా ప్రచారానికి దూరం కావటం టీడీపీ నేతల్లో కలవరాన్ని రేపుతోంది. జనసైనికులు దూరంగా ఉండటానికి గల కారణాలను అక్కడి టీడీపీ నాయకులు రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు.
బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఓడిపోయే యుద్ధంలోకి దిగిన తర్వాత రేపు తమ పరిస్థితి ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. కడపలో 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సుంకర శ్రీనివాస్ ప్రస్తుతం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించిన శ్రీనివాస్ జనసేన తరపున సొంతంగా ప్రచారం చేపట్టారు. కానీ, పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ టికెట్ టీడీపీ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అటు టీడీపీలో టిక్కెట్ ఆశించిన నేతలు, ఇటు జనసేన నాయకులు మొత్తంగా టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
సొంత పార్టీ నుంచే కాకుండా.. ప్యాకేజీ స్టార్ పార్టీ నుంచి కూడా సహకారం లేకపోవడంతో.. ఇక టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, అభ్యర్థిగా నిలిచిన ఆయన సతీమణి మాధవీరెడ్డి ప్రచారానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారట. భార్యాభర్తలిద్దరూ ప్లాన్ చేసుకుని కొంత మంది పెయిడ్ కార్యకర్తలను తీసుకువచ్చి వారితో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారట. ఇదంతా గమనించిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల రోజున పెయిడ్ కార్యకర్తలు ఓట్లు వేయించలేరని, ఇదేవిధంగా తమను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఫలితాలు మారోలా ఉంటాయని జనసైనికులు నేరుగా కామెంట్స్ చేస్తున్నారట.
మొదట్లో కలిసొచ్చిన జనసైనికులు అంతలోనే ముఖం చాటేయడంతో కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డికి, శ్రీనివాసులురెడ్డికి భయం మొదలైందట. సొంతపార్టీ నేతలు, మిత్రపక్షం సహకరించకపోతే.. బలమైన అధికారపక్షం అభ్యర్థిని ఢీకొనేదెలా అనే ఆందోళన మొదలైందట. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఢీకొడతాం. గెలిచి చూపిస్తాం అంటూ తొడగొట్టిన టీడీపీ నాయకులకు వాస్తవాలు బోధపడటంతో దిక్కుతోచడం లేదట. ఎన్నికలు రాకముందే చేతులెత్తేయాల్సిందేనా అనే అంతర్మథనం మొదలైందనే టాక్ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment